హైదరాబాద్, మార్చి 29: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2025 తుది విడత పరీక్షల తేదీలు మారే అవకాశం కన్పిస్తోంది. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. తొలుత ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులను శనివారం (మార్చి 29) ఎన్‌టీఏ విడుదల చేయనుంది. ఈ క్రమంలో సరిగ్గా ఇదే తేదీల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పరీక్షలు జరగనున్నాయి. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌ను ప్రకటించింది. సీబీఎస్సీ బోర్డు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 2న లాంగ్వేజెస్, ఏప్రిల్ 3న హోం సైన్స్, ఏప్రిల్ 4న ఫిజియాలజీ పరీక్షలు జరగనున్నాయి.
ఇక సీబీఎస్‌ఈ నిర్వహించే బోర్డు పరీక్షలు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగనున్నాయి. మరోవైపు జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఉదయం సాయంత్రం రెండు షిఫ్టుల్లో జరగున్నాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరో షిఫ్ట్ సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. దీంతో సీబీఎస్‌ఈ పరీక్ష రాసే విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌కు హాజరయ్యే అవకాశం లేకుండా పోతుంది. లేదంటే జేఈఈ మెయిన్స్ రాసే విద్యార్థులు సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలను వదిలేయాల్సి ఉంటుంది.
ఇలా రెండు పరీక్షల తేదీలు క్లాష్ అవడంతో పలువురు విద్యార్థులు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ అధికారులు సమీక్షించారు. పరీక్ష మార్పు చేయడం లేదంటే ప్రత్యామ్నాయాలపై నిర్ణయం ప్రకటించాలని కేంద్రం ఎన్‌టీఏకి సూచించింది. దీనిపై తుది నిర్ణయం ఈ రోజు వెల్లడించనుంది. ఈ క్రమంలో అంతా జేఈఈ పరీక్ష తేదీలు మారవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరీక్షలను ఏప్రిల్ 3వ లేదా 4వ వారంలో నిర్వహించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.