
చాలా మంది చక్కెరకు బదులుగా బెల్లాన్ని తీసుకోవడం ఎంతో ఆరోగ్యమని భావిస్తుంటారు. అందుకే టీ, కాఫీల్లోనూ బెల్లంతో చేసుకుంటుంటారు. బెల్లం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అందుకే అనాదిగా మన ఆహారంలో దీనికి ఎంతో ముఖ్యమైన స్థానం ఇచ్చారు. కానీ ఇప్పుడు బీపీ, షుగర్, కిడ్నీ వ్యాధుల వంటి దీర్ఘకాలిక మొండి రోగాల కారణంగా చాలా మంది ఈ తీపి పదార్థాలకు దూరమవుతున్నారు. అయితే, షుగర్ పేషెంట్లు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు ఈ బెల్లాన్ని తింటే ప్రమాదమా.. లేక ఇది కేవలం అపోహ మాత్రమేనా అనే విషయాలపై వైద్యనిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. స్వీట్లు, పిండి వంటల తయారీలో విరివిగా వాడే బెల్లం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ప్రతి రోజూ భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకోవాలని పెద్దవాళ్లు చెప్తుంటారు. ఇందులో కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.
వీరు తీసుకుంటే ఏమవుతుంది..
పంచదారతో పోలిస్తే బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఇందులో కూడా సహజమైన చక్కెరలుంటాయి. ఇది ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, డయాబెటిస్‌కు దారి తీస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో కిడ్నీలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. బెల్లంలో పొటాషియం ఉండటంతో, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారికి అది అధికంగా ఉంటే హానికరంగా మారవచ్చు. అందువల్ల, కిడ్నీ సమస్యలు ఉన్నవారు బెల్లాన్ని తీసుకునే ముందు డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.
మోతాదు మించకూడదు..
మీకు ముందే ఈ వ్యాధులు ఉంటే బెల్లాన్ని అతి మోతాదులో తీసుకోకూడదు. రోజుకు 1-2 టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకోవడం సాధారణంగా సురక్షితం. డయాబెటిస్ ఉన్నవారు తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. బెల్లం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అవకాశం ఉన్నందున, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు ముందుగా వైద్యులను సంప్రదించాలి. పొటాషియం స్థాయిలు పెరిగితే సమస్యలు రావచ్చు కాబట్టి, కిడ్నీ వ్యాధిగ్రస్తులు వైద్య నిపుణుల సూచన మేరకు బెల్లం తీసుకోవడం ఉత్తమం. పిండివంటల్లోనూ నాణ్యమైన బెల్లాన్ని మాత్రమే వినియోగించాలి. రసాయనాలు కలపని, సహజమైన బెల్లం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.