
ఒకప్పుడు ఐవీఎఫ్ చికిత్స పేరు చెబితే సంతానలేమి సమస్యలు ఉన్నవారే గుర్తుకువచ్చేవారు. అయితే, ఇప్పుడు ఈ చికిత్సతో కొత్త పోకడలు పుట్టుకొచ్చాయి. పిల్లలు లేని వారు మాత్రమే కాదు. ఇతర కారణాలతోనూ కొంతమంది జంటలు ఈ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. వ్యక్తిగత అవసరాలు, కెరీర్ ప్లానింగ్, ఆర్థిక ప్రణాళికల రిత్యా ఈ చికిత్సను ఎంచుకుంటున్నారు. కొన్ని అధునాతన టెక్నిక్స్ తో నచ్చినప్పుడు పిల్లల్ని కనొచ్చనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ ట్రెండ్ ఊపందుకుంటోంది.
ఐవీఎఫ్‌తో ఈ ఉపయోగాలు కూడా..
గతంలో ఐవీఎఫ్ ప్రధానంగా గర్భాశయ నాళాల అడ్డంకులు, తక్కువ స్పెర్మ్ కౌంట్, లేదా ఇతర వైద్యపరమైన వంధ్యత్వ సమస్యలకు చికిత్సగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు, ఐవీఎఫ్ జీవనశైలి ఎంపికలు, సామాజిక అవసరాలు, వ్యక్తిగత ప్రణాళికల కోసం కూడా ఎంచుకుంటున్నారు. ఈ కొత్త పోకడలు ఇలా ఉన్నాయి..
ఎగ్ ఫ్రీజింగ్ (సోషల్ ఎగ్ ఫ్రీజింగ్):
మహిళలు తమ కెరీర్, ఆర్థిక స్థిరత్వం, లేదా వ్యక్తిగత లక్ష్యాలను సాధించడానికి పిల్లలను కనడం వాయిదా వేస్తున్నారు. ఈ సందర్భంలో, ఎగ్ ఫ్రీజింగ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 20-30 ఏళ్ల వయసులో మహిళలు తమ అండాలను స్తంభన చేసి, భవిష్యత్తులో ఐవీఎఫ్ ద్వారా సంతానం కలిగి ఉండే అవకాశాన్ని ఎంచుకుంటున్నారు. ఈ ధోరణి ముఖ్యంగా నగరాల్లోని జాబ్ చేసే మహిళల్లో పెరుగుతోంది.
జన్యు స్క్రీనింగ్ కోసం ఐవీఎఫ్:
ప్రీ-ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ (పీజీటీ) ద్వారా, ఐవీఎఫ్ జంటలకు జన్యు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతోంది. ఉదాహరణకు, థలసీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, లేదా ఇతర జన్యు రుగ్మతల హిస్టరీ ఉన్న జంటలు ఆరోగ్యకరమైన పిండాన్ని ఎంచుకోవడానికి పీజీటీని ఉపయోగిస్తారు. ఈ సాంకేతికత వంధ్యత్వ సమస్య లేని జంటలకు కూడా ఆకర్షణీయంగా మారింది.
ఆ జంటలకు ఇదో వరం:
ఒకే విధమైన సెక్స్ కలిగిన జంటలు, ఒంటరిగా ఉంటున్న వ్యక్తులు సంతానం కోసం ఐవీఎఫ్‌ను ఎంచుకుంటున్నారు. స్పెర్మ్ డొనేషన్, ఎగ్ డొనేషన్, లేదా సరోగసీ వంటి వాటితో ఐవీఎఫ్ సాంప్రదాయ కుటుంబ నమూనాలను దాటి విస్తరిస్తోంది. వీటికి సామాజికంగా, చట్టపరంగా కూడా ఆమోదం లభిస్తుండటంతో ప్రజల్లో విస్తృతంగా ప్రజాదరణ పొందుతోంది.
ఆ బ్యాలెన్స్ కోసం ఐవీఎఫ్:
కొన్ని జంటలు కుటుంబంలో బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. అంటే వారికి ఇప్పటికే ఒక ఒక బాబు ఉంటే, ఆడ సంతానం కోసం ఐవీఎఫ్‌ను ఎంచుకుంటారు. ఈ ప్రక్రియలో పీజీటీ ద్వారా పుట్టబోయే వారి జెండర్ ను ఎంచుకోవచ్చు, అయితే ఈ ప్రాక్టీస్ భారత్ వంటి కొన్ని దేశాలలో నియంత్రణలకు లోబడి ఉంటుంది.