- ముంబైపై 12 పరుగుల తేడాతో బెంగళూరు విజయం
- ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ హాఫ్ సెంచరీ
- రెండోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం

ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 12 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా ఆర్సీబీ ఐదు వికెట్లకు 221 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (67; 42 బంతుల్లో 8×4 2×6), రజత్ పాటీదార్ (64; 32 బంతుల్లో 5×4, 4×6)లు హాఫ్ సెంచరీలు చేశారు. ఛేదనలో ముంబై తొమ్మిది వికెట్లకు 209 పరుగులకే పరిమితమైంది. తిలక్ వర్మ (56; 29 బంతుల్లో 4×4, 4×6) టాప్ స్కోరర్. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్యా (4/45), జోష్ హేజిల్‌వుడ్ (2/37), యశ్ దయాళ్ (2/46) రాణించారు.
32 బంతుల్లో 64 రన్స్ చేసిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్ కార్యక్రమంలో పాటీదార్ మాట్లాడుతూ.. ఆర్సీబీ బౌలర్లపై ప్రశంసలు కురిపించారు. వాంఖడే స్టేడియంలో బ్యాటింగ్ యూనిట్‌ను అడ్డుకోవడం అంత సులభం కాదని, తమ బౌలర్లు అద్భుతంగా బంతులు వేశారని ప్రశంసించాడు. ఈ విజయం క్రెడిట్ బౌలర్లదే అని, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వారికే చెందుతుందన్నాడు. చివరి ఓవర్ బాగా వేసిన కృనాల్ పాండ్యాను ఆర్సీబీ కెప్టెన్ మెచ్చుకున్నాడు. ఐపీఎల్ 2025లో రజత్ పాటిదార్ రెండోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
Also Read: Hardik Pandya: బయట వ్యక్తులకు ఏమీ తెలియదు.. తిలక్ ‘రిటైర్డ్ ఔట్’పై హార్దిక్ ఫైర్!
‘ఇది నిజంగా అద్భుతమైన మ్యాచ్. ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు చూపిన ధైర్యం అద్భుతం. నిజం చెప్పాలంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మా బౌలింగ్ యూనిట్‌కే చెందుతుంది. ఈ మైదానంలో బ్యాటింగ్ యూనిట్‌ను అడ్డుకోవడం అంత సులభం కాదు, కాబట్టి క్రెడిట్ వాళ్లకే ఇవ్వాలి. ఫాస్ట్ బౌలర్లు తమ ప్రణాళికలను అమలు చేసిన విధానం బాగుంది. కృనాల్ పాండ్యా బౌలింగ్ చేసిన విధానం అద్భుతం. చివరి ఓవర్‌లో బౌలింగ్ చేయడం అంత సులభం కాదు. అతను బౌలింగ్ చేసిన విధానం, చూపించిన ధైర్యం అద్భుతం. మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాలనుకున్నాం. అందుకే కేపీకి చివరి ఓవర్ ఇచ్చాం.వికెట్ బాగుంది, బ్యాట్ మీదకు బంతి చక్కగా వచ్చింది. మణికట్టు స్పిన్నర్ ప్రధాన బౌలర్లలో ఒకరు, ఎందుకంటే వారు వికెట్లు తీస్తారు. సుయాష్ శర్మ బౌలింగ్ చేసిన విధానం చాలా బాగుంది’ అని రజత్ పాటీదార్ చెప్పుకొచ్చాడు.