- ఐపీఎల్ 2025 షెడ్యూల్‌లో స్వల్ప మార్పు
- మంగళవారం రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు
- ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి

సాధారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వీకెండ్స్ శనివారం, ఆదివారం రెండు మ్యాచ్‌లు ఉంటాయి. మధ్యాహ్నం 3.30కు ఓ మ్యాచ్, రాత్రి 7.30కు మరో మ్యాచ్ ఆరంభం అవుతాయి. డబుల్ హెడర్ మ్యాచ్‌ల రోజున క్రికెట్ ఫాన్స్ పండగ చేసుకుంటారు. అయితే ఐపీఎల్‌లో వారం ఆరంభంలో ఎప్పుడూ రెండు మ్యాచ్‌లు జరగలేదు. ఐపీఎల్ 2025లో భాగంగా మొదటిసారిగా మంగళవారం (ఏప్రిల్ 8) రోజున రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు.
ఐపీఎల్ 2025 షెడ్యూల్ ప్రకారం.. ఈరోజు ఒకే ఒక మ్యాచ్ ఉంది. చండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య షెడ్యూల్ అయి ఉంది. అయితే ఏప్రిల్ 6న కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం జరగనుంది. ఏప్రిల్ 6న శ్రీరామనవమి వేడుకలు ఉన్న నేపథ్యంలో శోభాయాత్రకు, మ్యాచ్‌కు తగిన భద్రతను కల్పించలేమని బెంగాల్ పోలీసులు ‘క్యాబ్’కు లేఖ రాశారు. మ్యాచ్ తేదీని మార్చాలని కోరారు. దాంతో బీసీసీఐ ఐపీఎల్ 2025 షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చేసింది. ఏప్రిల్ 6న జరగాల్సిన మ్యాచ్.. నేడు జరగనుంది.