- చెన్నైతో బెంగళూరు ఢీ
- చెపాక్‌లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం
- చెన్నై కోటను బెంగళూరు బద్దలు కొట్టేనా?

ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్‌లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. 18వ సీజన్‌ను చెన్నై, ఆర్సీబీలు విజయాలతో ఆరంభించాయి. కోల్‌కతాపై బెంగళూరు, ముంబైపై చెన్నై గెలిచాయి. అదే జోరు కొనసాగించాలని రెండు జట్లూ చూస్తున్నాయి. అయితే చెన్నై కోటను బెంగళూరు బద్దలు కొట్టేనా? అనే అనుమానం అందరిలో నెలకొంది. ఇందుకు కారణం చెపాక్ గణాంకాలే.
ఐపీఎల్ మొదలై 18 ఏళ్లు అవుతోంది. గత 17 ఏళ్ల నుంచి చెన్నైలో బెంగళూరు గెలవలేదు. ఐపీఎల్ తొలి సీజన్ 2008లో చివరిగా చెపాక్‌లో ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. 2009 నుంచి చెపాక్‌లో ఆడిన బెంగళూరుకు నిరాశే మిగులుతోంది. 2008-24 మధ్య చెపాక్‌లో చెన్నై, బెంగళూరు మధ్య 9 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో చెన్నై 8సార్లు, ఆర్సీబీ ఒక మ్యాచ్ గెలిచింది. అలానే ఓవరాల్‌గా కూడా ఆర్సీబీపై సీఎస్కేకు మంచి రికార్డే ఉంది. ఇరు జట్ల మధ్య 33 మ్యాచ్‌లు జరగగా చెన్నై 21 మ్యాచ్‌లలో గెలిచింది. ఈ రికార్డ్స్ చెన్నైకి అనుకూలంగా ఉన్నాయి. మరి ఈ సీజన్‌లో అయినా చెన్నై కోటను బెంగళూరు బద్దలు కొడుతుందో లేదో చూడాలి.
ప్రస్తుతం బెంగళూరు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. విరాట్ కోహ్లీతో పాటు రజత్ పాటిదార్, ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టన్, జితేశ్ శర్మల బ్యాటింగ్ భారాన్ని మోయనునాన్రు. చెపాక్ పిచ్ స్పిన్‌కు అనుకూలం కాబట్టి జాకబ్ బెతెల్, టిమ్ డేవిడ్‌లలో ఒకరు ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇక స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఫిట్‌గా ఉంటే తుది జట్టులో ఆడతాడు. గత మ్యాచ్‌లో విరాట్ హాఫ్ సెంచరీ చేయగా.. పాటిదార్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్‌లో కృనాల్ పాండ్య, జోష్ హాజిల్‌వుడ్ సత్తాచాటారు. వీరందరూ చెలరేగితే.. విజయం పెద్ద కష్టమేమి కాదు.