- హైదరాబాద్ వ్యాపారవేత్త ఫిక్సింగ్ ప్రయత్నం.. బీసీసీఐ హెచ్చరిక
- ఐపీఎల్ జట్లకు ACSU సూచనలు.. అవినీతిపై అప్రమత్తత
- క్రికెట్ సమగ్రత కాపాడేందుకు బీసీసీఐ కఠిన చర్యలు

IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో ఒక షాకింగ్ వార్త క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసింది. హైదరాబాద్‌కు చెందిన ఒక బడా వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నిస్తున్నాడని, దీనిపై అన్ని ఐపీఎల్ జట్లను అప్రమత్తం చేస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) హెచ్చరిక జారీ చేసింది. ఈ వ్యాపారవేత్త ఐపీఎల్ జట్ల యజమానులు, ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, కామెంటేటర్లను కూడా టార్గెట్ చేస్తూ అవినీతి కార్యకలాపాల్లో భాగం చేయడానికి ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని బీసీసీఐ యాంటీ-కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ACSU) గుర్తించింది.
నివేదికల ప్రకారం, ఈ హైదరాబాద్ వ్యాపారవేత్తకు బుకీలు.. బెట్టింగ్ సిండికేట్‌లతో సంబంధాలు ఉన్నాయని, గతంలో కూడా అతడు అవినీతి కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు రికార్డులు ఉన్నాయని ACSU హెచ్చరించింది. అతడు తనను తాను ఒక సామాన్య అభిమానిగా పరిచయం చేసుకుంటూ… ఖరీదైన బహుమతులు, ఆభరణాలు, లగ్జరీ సౌకర్యాలతో ఆటగాళ్లు, కోచ్‌లు, సిబ్బందిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఆశ్చర్యకరంగా, ఈ వ్యక్తి ఆటగాళ్ల కుటుంబ సభ్యులను, జట్టు యజమానులను, విదేశాల్లో నివసిస్తున్న వారి బంధువులను కూడా సోషల్ మీడియా ద్వారా సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
బీసీసీఐ ఈ విషయంలో జీరో-టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోంది. అన్ని ఐపీఎల్ జట్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, ఈ వ్యక్తితో ఎలాంటి సంబంధం ఉన్నా వెంటనే తమ ఇంటిగ్రిటీ అధికారులకు రిపోర్ట్ చేయాలని సూచించింది. జట్లు, వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద సంప్రదింపులను తక్షణం నివేదించాలని ACSU కోరింది.
ప్రస్తుతానికి ఈ వ్యాపారవేత్త గుర్తింపు గోప్యంగా ఉంచబడింది, కానీ అతడు గతంలో కూడా ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు యాంటీ-కరప్షన్ అధికారులకు తెలిసిన వ్యక్తి అని సమాచారం. అతడు జట్టు హోటళ్లలో, మ్యాచ్‌ల సమయంలో, ప్రైవేట్ పార్టీలలో కనిపిస్తూ ఆటగాళ్లు, సిబ్బందితో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ విధానం ద్వారా అతడు ఐపీఎల్ పరిధిలోకి చొచ్చుకొని అవినీతి కార్యకలాపాలకు పాల్పడాలని భావిస్తున్నట్లు ACSU అనుమానిస్తోంది.
Vida V2 Electric Scooters: బంపర్ ఆఫర్.. ఈ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై 32వేలు తగ్గింపు!