IPL 2025: హైదరాబాద్ కి మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్! 11 కోట్ల ప్లేయర్ తో పాటు ఇంకొకరిపై వేటు?

Written by RAJU

Published on:


ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇటీవల ముంబై ఇండియన్స్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ, కేవలం 48 గంటల వ్యవధిలోనే మరో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈసారి ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్. శుక్రవారం చెన్నైలోని చెపాక్ మైదానంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించాయి. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓడిన జట్టు పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున పడిపోతుంది. అందుకే ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

తాజా పరాజయాల వల్ల తీవ్ర ఒత్తిడిలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓపెనర్లైన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లపై పూర్తిగా ఆధారపడి ఉంది. వీరిద్దరూ రాణిస్తేనే విజయానికి అవకాశముండేలా జట్టు పరిస్థితి తయారైంది. మిడిలార్డర్‌లో ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి ఘోరంగా విఫలమవుతూ జట్టు విజయానికి అడ్డంకిగా మారుతున్నారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన అతను ఆ తర్వాత ఒక్క మ్యాచ్‌లోనూ ప్రభావవంతంగా ఆడలేకపోయాడు. రూ. 11.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ప్లేయర్ విఫలమవుతుండటంతో అతనిపై వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో అభినవ్ మనోహర్‌ను తీసుకుని, ఎక్స్‌ట్రా స్పిన్నర్‌గా రాహుల్ చాహర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే యోచనలో ఉంది జట్టు మేనేజ్‌మెంట్.

ఇంకా బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు అవసరమవుతున్నాయి. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి చోటు కల్పించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. అతని స్థానంలో బరిలోకి దిగిన జయదేవ్ ఉనాద్కత్ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో చెన్నై మైదానం పిచ్ పేసర్లతో పాటు స్పిన్నర్లకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్లీ షమీకి తుది జట్టులో స్థానం కల్పించే అవకాశం ఉంది. అలా అయితే జయదేవ్ ఉనాద్కత్‌పై వేటు పడనుంది. అలాగే స్పిన్నర్ అవసరం ఉన్న నేపథ్యంలో రాహుల్ చాహర్‌కు అవకాశం లభించే అవకాశాలు మెరుగుగా కనిపిస్తున్నాయి.

చెన్నై మైదానం సాధారణంగా నెమ్మదైన వికెట్‌గా ఉంటుందని తెలిసిన నేపథ్యంలో బ్యాటర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడే అవకాశముంది. టాపార్డర్ చెలరేగితేనే జట్టు విజయానికి దోహదపడుతుంది. మరోవైపు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. మళ్లీ ఓడిపోతే టోర్నమెంట్ నుంచి అవుట్ కానే ప్రమాదం ఎదురవుతుంది.

ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడే మ్యాచ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇలా ఉండనుంది.

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అభినవ్ మనోహర్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగా.

ఇంపాక్ట్ ప్లేయర్: రాహుల్ చాహర్.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights