IPL 2025: హార్ధిక్‌ పాండ్యాను దారుణంగా వేధించారు! టీమిండియా క్రికెటర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Written by RAJU

Published on:


టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్‌ పాండ్యా విషయంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ మొహమ్మద్‌ కైఫ్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్‌ 2025 ఆరంభం కాబోతున్న సమయంలో కైఫ్‌.. ఐపీఎల్‌ 2024 గురించి మాట్లాడుతూ.. ఆ సీజన్‌లో పాండ్యా ఎదుర్కొన్న ద్వేషాన్ని మరోసారి గుర్తు చేశాడు. ఆ సీజన్‌కి ముందు పాండ్యాను చాలా దారుణంగా వేధించారంటూ కైఫ్‌ పేర్కొన్నాడు. ఒక ఆటగాడిగా అంత ద్వేషాన్ని భరిస్తూ ఎదగడం నిజంగా చాలా కష్టం. గత ఐపీఎల్‌ సీజన్‌లో అభిమానులు పాండ్యాను తిట్టారు, తిరస్కరించారు. కానీ, అవన్ని దాటుకొని పాండ్యా ఇప్పటికీ స్ట్రాంగ్‌గా నిల్చున్నాడు.

పాండ్యా జీవితంలో గడిచిన ఈ కొంత కాలం జరిగిన దాంతో అతని బయోపిక్‌ లేదా డాక్యూమెంట్రీ తీయొచ్చు అని కైఫ్‌ అన్నాడు. ఏ ఆటగాడైనా తనకు జరిగిన అవమానం అస్సలు మర్చిపోడంటూ పేర్కొన్నాడు. కాగా, ఆ సీజన్‌ కంటే ముందు ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మను తప్పించి ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం హార్ధిక్‌ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ విషయంలోనే ముంబై అభిమానులతో పాటు రోహిత్‌ ఫ్యాన్స్‌కు కోపం వచ్చింది. ఆ కోపానంతా పాపం హార్ధిక్‌ పాండ్యాపై చూపించారు. అన్నింటికీ అతనే కారణం అంటూ.. ముంబై మ్యాచ్‌ ఆడిన ప్రతిసారీ పాండ్యా కనిపిస్తే చాలా బో అంటూ స్టేడియం హోరెత్తిపోయేది.

దానికి తోడు రోహిత్‌ను బౌండరీ లైన్‌ వద్దకు పాండ్యా ఫీల్డింగ్‌కి పంపడం కూడా పాండ్యాపై అభిమానుల కోపాన్ని మరింత పెంచాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. సొంత దేశ అభిమానుల నుంచి అంత ద్వేషాన్ని చూసిన పాండ్యా.. ఆ తర్వాత టీమిండియా రెండు ఐసీసీ ట్రోఫీలు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2024లో టీ20 వరల్డ్‌ కప్‌, తాజాగా గెలిచిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో తన వంతు పాత్ర పోషించడంతో అభిమానుల కోపం పూర్తిగా తగ్గిపోయి.. ముంబై కెప్టెన్‌గా పాండ్యాను ఒప్పేసుకున్నారు. ఇప్పుడు పాండ్యా కనిపిస్తే చాలు స్టేడియాలు చప్పట్లతో దద్దరిల్లిపోతున్నాయి. కేవలం ఏడాది కాలంలోనే తనపై ఉన్న ద్వేషాన్ని ప్రేమగా మల్చుకున్నాడు పాండ్యా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification