IPL 2025: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ మార్పు? పాండ్యా ప్లేస్‌లో టీమ్‌ని నడిపించేది అతనేనా?

Written by RAJU

Published on:


ఐపీఎల్‌ 2025లో ముంబై ఇండియన్స్‌ ప్రదర్శన బాగాలేదనే విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌ గెలిచింది. ఆ టీమ్‌కు ఇంకా పది మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే.. ఇక్కడ నుంచి వాళ్లకు ప్రతీ మ్యాచ్‌ ముఖ్యమే. 10లో 7 గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటారు. కానీ, ప్రస్తుతం వాళ్ల ఫామ్‌ చూస్తుంటే అది అంత సులువగా కనిపించడం లేదు. కానీ, వాళ్ల నెక్ట్స్‌ మ్యాచ్‌కు జస్ప్రీత్‌ బుమ్రా అందుబాటులోకి రానుండటంతో ముంబై ఇండియన్స్‌లో ఆశలు చిగురిస్తున్నాయి. అలాగే గాయం నుంచి రోహిత్‌ కోలుకొని తన ఫామ్‌ను అందుకుంటే.. ముంబై ఇండియన్స్‌ గాడిన పడే అవకాశం ఉందంటున్నారు క్రికెట్‌ నిపుణులు.

అయితే.. బుమ్రా వచ్చాక కూడా జట్టు పరిస్థితి మెరుగుపడకుంటే.. కెప్టెన్‌ను మార్చాలని ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా బౌలర్‌గా అదరగొడుతున్నప్పటికీ.. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. జట్టులో విభేదాలు, తిలక్‌ వర్మను రిటైర్డ్‌ అవుట్‌గా పిలవడం, టీమ్‌ ప్రదర్శన దారుణంగా ఉండటం ఇవన్నీ కూడా పాండ్యా కెప్టెన్సీకి ఎసరు తెచ్చేలా ఉన్నాయి. ఒక్క కెప్టెన్‌ను మారిస్తే.. టీమ్‌ అంతా అవుతుందని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోందని తెలుస్తోంది. హార్ధిక్‌ పాండ్యాకు గత సీజన్‌లోనే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ముంబైను కాదని, 2022 సీజన్‌లో కొత్త టీమ్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వెళ్లిన పాండ్యాను మళ్లీ 2024 సీజన్‌ కంటే ముందు వెనక్కి పిలిపించి, రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించారు.

ఇది జట్టులో కాస్త డిస్టబెన్స్‌ను సృష్టించింది. రోహిత్‌, ముంబై ఫ్యాన్స్‌ పాండ్యాను గత సీజన్‌లో ఎంత దారుణంగా ట్రోల్‌ చేశారో చూశాం. ఈ సీజన్‌లో కూడా రోహిత్‌, పాండ్యా మధ్య ఇంకా విభేదాలు సమసిపోలేదని తెలుస్తోంది. గత మ్యాచ్‌లో రోహిత్‌ ఏదో చెబుతుంటే.. పాండ్యా పట్టించుకోకపోవడంపై కూడా విమర్శలు వచ్చాయి. దీంతో కెప్టెన్సీ మార్పే సరైన పరిష్కారం అని ముంబై మేనేజ్‌మెంట్‌ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పాండ్యా స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి చూడాలి ముంబై తిరిగి పుంచుకుని పాండ్యా కెప్టెన్‌గా కొనసాగుతాడో.. లేక సీజన్‌ మధ్యలో ముంబైకి కొత్త కెప్టెన్‌ వస్తాడో?

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification
Verified by MonsterInsights