ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు ప్రధాన బలంగా ఉన్న దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ తిరిగి జట్టులో చేరే అవకాశంపై ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. రబాడాను ₹10.75 కోట్లు వెచ్చించి IPL 2025 మెగా వేలం సమయంలో గుజరాత్ కొనుగోలు చేసింది. వ్యక్తిగత కారణాల వల్ల సీజన్ ప్రారంభంలోనే స్వదేశానికి రబాడ తిరిగి వెళ్లిపోయాడు. అయితే, గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ ఆశిష్ కపూర్ తాజా ప్రకటనలో రబాడ రెండవ దశలో తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కుటుంబ సమస్య కారణంగా ప్రస్తుతం అందుబాటులో లేని రబాడ సకాలంలో ఆ సమస్య పరిష్కారమైతే మళ్లీ జట్టులో చేరే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రబాడ జట్టును వీడినప్పటికీ, గుజరాత్ ఫ్రాంచైజీ ఇప్పటివరకు అతని స్థానాన్ని భర్తీ చేయలేదు. ఇది రబాడ తిరిగి వచ్చే అవకాశాన్ని బలపరుస్తోంది. ఈ నేపథ్యంలో, పేస్ బౌలింగ్ విభాగంలో జట్టు కుల్వంత్ ఖేజ్రోలియాను మూడవ ఎంపికగా తీసుకుంది. మరోవైపు, గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో దాసున్ షనకను ఎంపిక చేసిన ఫ్రాంచైజీ, రబాడ స్థానంలో ఎవరినీ నేరుగా ఎంపిక చేయలేదు. “మేము అతని కోసం ఎదురుచూస్తున్నాం. అతను తిరిగి వచ్చే అవకాశముంది, కానీ ప్రస్తుతం అతనికి కుటుంబ సంబంధిత సమస్య ఉంది. అది పరిష్కారమయ్యాక అతను తిరిగి వస్తాడు. ఎప్పుడు వస్తాడో చెప్పలేం, కానీ మేము ఆశగా ఎదురుచూస్తున్నాం” అని ఆశిష్ కపూర్ అన్నారు.
గుజరాత్ టైటాన్స్ తరఫున రబాడ రెండు మ్యాచ్‌లు ఆడాడు. అహ్మదాబాద్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా జిటి తరఫున తన అరంగేట్రం చేసిన రబాడ, ఆ మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను అవుట్ చేయగా, ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాను ఔట్ చేశాడు. ఈ రెండు మ్యాచ్‌లలో అతను ఒక్కో వికెట్ సాధించాడు.
రబాడ లేని పరిస్థితుల్లో గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ యూనిట్ ప్రభావవంతంగా రాణించింది. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ జంట ఇప్పటివరకు కలిసి 20 వికెట్లు తీసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతోపాటు ఎడమచేతి వాటం స్పిన్నర్ సాయి కిషోర్ అద్భుత ప్రదర్శనలతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయినప్పటికీ, రబాడ వంటి ఇంటర్నేషనల్ బౌలర్ తిరిగి జట్టులోకి వస్తే, గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ దళం మరింత శక్తివంతమవుతుందని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం రబాడ తిరిగొస్తాడన్న ఆశతో అభిమానులు, ఫ్రాంచైజీ సభ్యులు అంతా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..