టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున ఆడుతున్న మహ్మద్ షమీ ప్రదర్శనపై గంభీరంగా స్పందించారు. ప్రస్తుతం షమీ చూపుతున్న ఆటతీరు, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు అవసరమైన స్థాయికి చాలా తక్కువగా ఉందని ఆయన అన్నారు. 2025 ఐపీఎల్ వేలంలో షమిని SRH రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఫ్రాంచైజీకి ఇషాన్ కిషన్ తరువాత అతనె ముఖ్యమైన ఖరీదైన కొనుగోలు.
2025 IPLలో షమీ పేలవ ఫామ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొమ్మిది వికెట్లు తీసిన ఘనత తర్వాత షమీ IPLలో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌ల్లో కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీసి, ఓవర్‌కు సగటున 11 పరుగులు ఇచ్చాడు. గత శుక్రవారం తన మాజీ జట్టు గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షమీ నాలుగు ఓవర్లలో 48 పరుగులు ఇచ్చాడు. పవర్ ప్లేలో సాయ్ సుదర్శన్ ఒక్కడే అతనిపై ఐదు బౌండరీలు బాదాడు.
చోప్రా ప్రకారం, షమీ బౌలింగ్‌లో స్పష్టత లేకపోవడమే SRHకి పెద్ద సమస్యగా మారింది. “ఈ టోర్నమెంట్‌లో మీరు ఎవరో అనే విషయం కాదు. బాగా ఆడకపోతే, ఎవ్వరినైనా చిత్తు చేస్తారు. ఇప్పుడు షమీ విషయంలో చూస్తే, వేగం తగ్గిపోయింది, పైగా వరుసగా ఒకే లెంగ్త్‌లో బంతులు వేయడంలేదు,” అని ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
గాయాల తర్వాత తిరిగొచ్చినా ఫిట్‌నెస్‌పై అనుమానాలు
2023 వరల్డ్ కప్ సమయంలో జరిగిన పాదం గాయం కారణంగా షమీ దాదాపు 10 నెలలు ఆటకు దూరంగా ఉన్నాడు. దాంతో పాటు, IPL 2024, T20 వరల్డ్ కప్ 2024లో కూడా పాల్గొనలేకపోయాడు. అయినప్పటికీ, తరువాత ఆయన దేశీ క్రికెట్‌తో పాటు టీ20లు, వన్డేలు ఆడారు. “ఇది ఈ మధ్యే గాయం నుంచి తిరిగొచ్చిన వ్యవహారం కాదు. గత సంవత్సరం నుంచే షమీ డొమెస్టిక్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఇప్పుడు మే నెల. మధ్యలో ఐసీసీ టోర్నమెంట్ కూడా ఆడేశాడు. అయినా ఇప్పటికీ ఫామ్‌లో లేడంటే, అది గాయంతో సంబంధం ఉందని అనుకుంటే, ఇది టీమిండియాకు పెద్ద సందిగ్ధ పరిస్థితి,” అని చోప్రా వ్యాఖ్యానించారు.
ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు తలనొప్పి
2023 వరల్డ్ కప్ తర్వాత తొలిసారి బుమ్రా, షమీ ఇద్దరూ ఫిట్‌గా ఉన్నారు. అయితే షమీ ఫామ్ లేకపోవడంతో సెలెక్టర్లు వేరే పేసర్లవైపు చూస్తారనే అవకాశముంది. “SRH ఫామ్ ఒక విషయం. కానీ మరొకటి ఇంగ్లాండ్ పర్యటన. బార్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా ఒక్కడే ఉన్నాడు. షమీ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అందరూ అన్నారు. కానీ ఇప్పుడు ప్రశ్న ఇది.. షమీ ఉంటాడా? ఉంటే ఎలా ఉంటాడు?” అని చోప్రా సవాలుగా ప్రశ్నించారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..