ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఎన్నో కీలక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇందులో ఒక ముఖ్యమైన ఘట్టం, రియాన్ పరాగ్ చేసిన రికార్డు స్థాయి ఫీల్డింగ్ ప్రదర్శన. తక్కువ కాలంలోనే రాయల్స్ జట్టులో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న రియాన్ పరాగ్, ఈ మ్యాచ్ ద్వారా మరో చరిత్రను సృష్టించాడు. బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరిసే పరాగ్, ఈసారి తన ఫీల్డింగ్ నైపుణ్యంతో అజయమైన ఘనతను అందుకున్నాడు.
అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ పోరెల్ స్లోగ్ షాట్‌ను డీప్‌లో రియాన్ పరాగ్ అద్భుతంగా క్యాచ్ తీసి ఔట్ చేశాడు. ఈ క్యాచ్‌తో అతను రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా ఎదిగాడు. గతంలో ఈ ఘనత మాజీ కెప్టెన్ అజింక్య రహానే సొంతం చేసుకున్నాడు, కానీ ఇప్పుడు పరాగ్ అతన్ని అధిగమించాడు. రహానే 106 మ్యాచ్‌లలో 40 క్యాచ్‌లు పట్టగా, పరాగ్ మాత్రం కేవలం 77 మ్యాచ్‌ల్లోనే 41 క్యాచ్‌లు అందుకున్నాడు. దీంతో అతను టాప్‌లో నిలవగా, జోస్ బట్లర్ 31 క్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు.
ఈ చారిత్రాత్మక క్షణం విషయంలో వనిందు హసరంగా వేసిన గూగ్లీ బంతికి పోరెల్ భారీ షాట్‌కు యత్నించగా, పరాగ్ డీప్‌లో ముందుకు పరుగెత్తుతూ అద్భుత క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది కేవలం ఒక వికెట్ మాత్రమే కాదు, అతని ఫీల్డింగ్ కెరీర్‌లో గుర్తుంచుకోదగ్గ ఘట్టం కూడా.
ఇక మ్యాచ్ తుది ఘట్టం మరింత ఉత్కంఠ రేపింది. 188 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సిన రాజస్థాన్, చివరి ఓవర్‌కు వచ్చేసరికి కేవలం 9 పరుగులే అవసరం. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శించి, కేవలం 8 పరుగులే ఇచ్చి మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లాడు. ఈ ప్రదర్శనపై సంజు సామ్సన్ కూడా ప్రత్యేకంగా స్పందించాడు. “స్టార్సీ నిజంగా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను ఎందుకు ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడో అందరికీ చూపించాడు. 20వ ఓవర్లోనే మ్యాచ్‌ను గెలిపించాడు,” అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు.
సూపర్ ఓవర్‌లో రాజస్థాన్ రాయల్స్ 11 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున KL రాహుల్ మరియు ట్రిస్టన్ స్టబ్స్ క్రీజ్‌లోకి వచ్చి, కేవలం నాలుగు బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని నమోదు చేశారు. చివరి ఓవర్‌తో పాటు సూపర్ ఓవర్‌లోనూ సందీప్ శర్మ రాజస్థాన్ తరఫున బౌలింగ్ బాధ్యతలు చేపట్టాడు. కాగా, ఈ మ్యాచ్‌లో సందీప్ శర్మ వేసిన ఓవర్ కూడా అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అతను ఒకే ఓవర్‌లో 11 బంతులు వేయడంతో ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..