IPL 2025: అప్పుడు కోహ్లీ చేస్తే ఒప్పు.. ఇప్పుడు ఇతను చేస్తే తప్పా..! ఇదెక్కడి న్యాయం?

Written by RAJU

Published on:


ఐపీఎల్‌ మెల్లమెల్లగా హీట్‌ ఎక్కుతోంది. మంగళవారం పంజాబ్‌ కింగ్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఇంట్రెస్టింగ్‌ సీన్‌ చోటు చేసుకుంది. లక్నో బౌలర్‌, పంజాబ్‌ బ్యాటర్‌కు నోట్‌ బుక్‌ సెలబ్రేషన్‌తో సెండ్‌ ఆఫ్‌ ఇచ్చాడు. ఇది కాస్త వివాదాస్పదమైనప్పటికీ.. క్రికెట్‌ అంటే ఈ మాత్రం మజా ఉండాలని ఫ్యాన్స్ అంటున్నారు. అసలింతకీ ఏం జరిగిందంటే..? పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా.. మూడో ఓవర్ లో పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యను లక్నో బౌలర్‌ దిగ్వేశ్ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత ప్రియాంశ్‌ దగ్గరకు పరుగెత్తుకు వెళ్లి నోట్‌ బుక్‌ సెలబ్రేషన్‌ చేసుకున్నాడు. అతని దగ్గరికి వెళ్లి చేతిపై ఏదో రాస్తున్నట్లు.. అంటే నీ వికెట్‌ను నా ఖాతాలో వేసుకున్నాను అనే అర్థం వచ్చేలా చేతిపై సంతకం చేసి అతడికి చూపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌ అయింది.

కొంతమంది దిగ్వేశ్‌ చేసుకున్న సెలబ్రేషన్‌పై విమర్శలు చేస్తుంటే.. మరికొంత మంది అప్పుడు కోహ్లీ చేస్తే తప్పు లేదు కానీ, ఇప్పడు దిగ్వేశ్‌ చేస్తే తప్పు అనిపిస్తోందా అంటూ అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. 2017లో విరాట్ కోహ్లీ ఔట్ అయిన సందర్భంలో కెస్రిక్‌ విలియమ్స్ నోట్ బుక్, సంతకం సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాతి మ్యాచులో విలియమ్స్‌ బౌలింగ్‌లోనే వరుసగా బౌండరీలు బాదాడు కోహ్లీ. అప్పుడు తాను కూడా ‘సంతకం’ సెలబ్రేషన్స్‌ను తిరిగి ఇచ్చాడు. ఆ సీన్స్‌ చాలా అగ్రెసివ్‌గా ఉంటాయి. ఇప్పటికీ భారత క్రికెట్‌ అభిమానులకు ఆ సీన్స్‌ చూస్తే గూస్‌బమ్స్‌ వస్తాయి. అయితే.. అప్పుడు కోహ్లీ చేసింది, ఇప్పుడు దిగ్వేశ్‌ చేసింది సేమ్‌ సెలబ్రేషన్‌ అయినా.. రెండింటికి చాలా తేడా ఉంది.

అప్పుడు వెస్టిండీస్‌ బౌలర్‌ ముందుగా కవ్విస్తే.. ఆ తర్వాత కోహ్లీ బదులిచ్చాడు. కానీ, ఇక్కడ దిగ్వేశ్‌, ప్రియాంశ్‌ ఆర్య ఏమి అనకపోయినా.. అతని దగ్గరికి వెళ్లి మరీ ఇలా చేయడం కాస్త అతిగా అనిపిస్తోందని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. ఈ విషయంపై భారత దిగ్గజ మాజీ క్రికెటర్‌ సునీల్ గావస్కర్ మాట్లాడుతూ.. కోహ్లీ అలా చేయడంలో అర్థం ఉందని, కానీ దిగ్వేశ్‌ అలా చేయడంలో ఎటువంటి అర్థం లేదనిపిస్తోందని పేర్కొన్నాడు. ఎందుకంటే వరుసగా 5 బంతులు డాట్స్‌గా వేసి, ఆ తర్వాత చివరి బంతికి వికెట్ పడినప్పుడు ఇలాంటి సంబరాలు చేసుకోవడంలో ఎటువంటి అర్థం లేదు అని అన్నాడు. కాగా, ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కూడా దిగ్వేశ్ చర్యకు గానూ అతడి మ్యాచులో ఫీజులో 25 శాతం కోత పెట్టడంతో పాటు ఓ డిమెరిట్ పాయింట్ విధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Subscribe for notification
Verified by MonsterInsights