7వ తేదీ నుంచి అడ్మిషన్లు.. మధ్యలో వేసవి సెలవులు
వచ్చే ఏడాది నుంచి ఎంబైపీసీ.. గణితం, సైన్స్ సబ్జెక్టులు విలీనం
విద్యాసంవత్సరం క్యాలెండర్ సిద్ధం.. త్వరలోనే ప్రకటించనున్న బోర్డు
అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకు రానుంది. ఓవైపు విద్యాపరంగా అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. తాజాగా విద్యా సంవత్సర కాలాన్ని కూడా మార్పు చేశారు. ఏటా జూన్ 1 నుంచి ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. కానీ, ఈ ఏడాది నుంచి ఏప్రిల్ 1 నుంచే ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇంటర్ విద్యామండలి అకడమిక్ క్యాలెండర్‌ను సిద్ధం చేసింది. దీని ప్రకారం 2025-26 ఇంటర్ విద్యా సంవత్సరం రానున్న ఏప్రిల్‌లోనే ప్రారంభమవుతుంది. 23వ తేదీ వరకు తరగతులు నిర్వహిస్తారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచి అడ్మిషన్లు మొదలుకానున్నాయి. అదే నెల 24 నుంచి మే నెలాఖరు వరకు వేసవి సెలవులు ఇస్తారు. జూన్ 1న మళ్లీ కాలేజీలు పునఃప్రారంభమవుతాయి. అయితే, ఈ ఏడాది జూన్1 ఆదివారం కావడంతో 2న కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయి. మొత్తం 235 రోజుల పాటు ఇంటర్ తరగతులు నిర్వహించేలా విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను రూపొందించారు. వేసవి సెలవులు కాకుండా 79 సెలవులు విద్యా సంవత్సరంలో ఉంటాయి. అలాగే వచ్చే ఏడాది నుంచి సబ్జెక్టుల్లోనూ ఇంటర్ బోర్డు సమూల మార్పులు చేసింది. ప్రస్తుతం గణితం ఏ, బీ రెండు సబ్జెక్టులుగా ఉండగా, వాటిని ఒకటిగా మార్చింది.
అలాగే వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం సబ్జెక్టులను జీవశాస్త్రంగా(బయాలజీ) మార్పు చేశారు దీంతో ఇంటర్‌లో సైన్స్ గ్రూపుల్లో ఇకపై 5 సబ్జెక్టులే ఉంటాయి. ఎంపీసీలో గణితం, ఫిజిక్స్, కెమిస్ర్టీ, ఇంగ్లిష్ తప్పనిసరి సబ్జెక్టులుగా ఉంటాయి. మరో సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవచ్చు. విద్యార్థులు వారికి నచ్చిన సబ్జెక్టును ఎంపిక చేసుకుని చదవొచ్చు. బైపీసీలో ఫిజిక్స్, కెమిస్ర్టీ, బయాలజీ, ఇంగ్లిష్, ఒక ఎంపిక సబ్జెక్టు ఉంటాయి. ఈ రెండు గ్రూపుల విద్యార్థులు ఆరో సబ్జెక్టు ఏదైనా కావాలనుకుంటే చదువుకోవచ్చు. అదనపు సబ్జెక్టు మార్కులు మొత్తం మార్కుల్లో కలపరు. అలాగే ఉన్నతవిద్యలో ఇంజనీరింగ్, మెడిసిన్‌లో అవకాశాన్ని బట్టి ఏదైనా చదవాలనుకునేవారికి ‘ఎంబైపీసీ’ గ్రూపును ప్రవేశపెడుతున్నారు. దీనిలో గణితం, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ర్టీ, ఇంగ్లిష్ ఉంటాయి. కావాలంటే అదనపు సబ్జెక్టు తీసుకోవచ్చు. మొత్తం వెయ్యి మార్కులకే పరీక్షలు జరుగుతాయి. దీనిపై త్వరలోనే ప్రకటన విడుదలకానుంది.
ఇవి కూడా చదవండి..
Delhi High Court Judge: నోట్ల కట్టల ఆరోపణలు నిరాధారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ
Karnataka: ఘోర ప్రమాదం.. భారీ రథాలు కూలిపోయి.. బాబోయ్..
Navy Employee Case: నాకు ఫుడ్ వద్దు.. డ్రగ్స్ కావాలి.. నిందితురాలి కొత్త డిమాండ్
Read Latest and National News
Updated Date – Mar 24 , 2025 | 03:17 AM