Inter Paper Analysis 2025: హడావుడిగా ఇంటర్‌ మూల్యాంకనం ఎందుకో..? ఒక్కో ఎగ్జామినర్‌కు రోజుకు 45 నుంచి 60 వరకు అందజేత!

Written by RAJU

Published on:

Inter Paper Analysis 2025: హడావుడిగా ఇంటర్‌ మూల్యాంకనం ఎందుకో..? ఒక్కో ఎగ్జామినర్‌కు రోజుకు 45 నుంచి 60 వరకు అందజేత!

హైదరాబాద్, ఏప్రిల్‌ 6: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ కొనసాగుతుంది. ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని రాష్ట్రంలో 19 సెంటర్లల్లో నిర్వహిస్తున్నారు. మార్చి 19 నుంచి మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభమవగా.. ఏప్రిల్‌ 10వ తేదీతో ముగియనుంది. ప్రతి సెంటర్‌లో దాదాపు 600 నుంచి 1200 మంది వరకు సిబ్బంది మూల్యాంకన విధుల్లో పాల్గొంటున్నారు. అయితే ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం చేస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. రాష్ట్రంలోని పలు స్పాట్‌ కేంద్రాల్లో ఒక్కో అధ్యాపకుడికి (ఎగ్జామినర్‌) రోజుకు 30 జవాబు పత్రాలకు బదులు 45 నుంచి 60 వరకు జవాబు పత్రాలు ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా జవాబు పత్రాలను హడావిడిగా దిద్దడం జరుగుతుందని, తద్వారా విద్యార్థులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని కొందరు అధ్యాపకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

విడతల వారీగా జరుగుతున్న ఈ మూల్యాంకనం ప్రక్రియకు ప్రతి రోజూ ఎగ్జామినర్లు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం గంట పాటు భోజన విరామం మినహా గంటకు 5 చొప్పున ప్రతి 12 నిమిషాలకు ఒక జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేయవల్సి ఉంటుంది. 30 ఆన్సర్‌ షీట్లను దిద్దాల్సి ఉంటుంది. వరంగల్‌ ఎల్‌బీ కళాశాలలో స్పాట్‌కు హాజరవుతున్న ఒక అధ్యాపకుడు ఈ విషయాన్ని వెల్లడించాడు. ఒక్కో ఎగ్జామినర్‌కు రోజూ 45 జవాబు పత్రాలు ఇస్తున్నారని, రసాయనశాస్త్రం సబ్జెక్టుకు 60 ఇస్తున్నట్లు తెలిపారు. ఇలా పరిమితికి మించి ఇస్తే అన్ని పేపర్లు సక్రమంగా చూసి దిద్దడం కష్టమవుతుందని, ఇది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటమేనని ఆయన అన్నారు.

రోజుకు 60 పేపర్లు ఇస్తే గంటకు 10 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. 24 పేజీల బుక్‌లెట్‌లోని జవాబులను పరిశీలించి, మార్కులు వేసి, మొత్తం లెక్కించే ప్రక్రియను సగటున కేవలం ఆరు నిమిషాలలోనే ముగించాల్సి ఉంటుంది. అదీ మధ్యలో ఒక్క నిమిషం కూడా బ్రేక్‌ తీసుకోకుండా ఉంటేనే సాధ్యం. అలా ఎక్కడైనా జరుగుతుందా అన్నది ప్రశ్నార్థకం. వరంగల్‌ కేంద్రంలో ఇంగ్లిష్‌ సబ్జెక్టు మూల్యాంకనం ఏప్రిల్‌ 4న ముగిస్తే.. ఏప్రిల్ 8న ముగిసినట్లు ఉత్తర్వు కాపీలు ఇచ్చారని, అంటే నాలుగు రోజులు అదనంగా దిద్దాల్సిన వాటిని ముందుగానే హడావిడిగా పూర్తి చేయించినట్లు మరో ఎగ్జామినర్‌ పేర్కొన్నారు. ఇలా హడావిడిగా మూల్యాంకనం చేయడం వల్ల విద్యార్ధులకు నష్టం తప్ప ఒరిగేదేమిటో తెలియడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Subscribe for notification
Verified by MonsterInsights