TS Inter Result 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. ఇక విద్యార్థుల చూపంతా ఫలితాల వెల్లడిపైనే ఉంటుంది. అందుకు తగ్గట్లుగా ఇంటర్ బోర్డు సైతం వేగంగా మూల్యాంకనం చేపడుతోంది.

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 5వ తేదీన మొదలై 25వ తేదీతో ముగిశాయి. ప్రస్తుతం మూల్యాంకన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఏప్రిల్ చివరి వారంలో లేదా మే నెల ప్రారంభంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TSBIE) అధికారిక వర్గాల సమాచారం. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://tgbie.cgg.gov.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.
జూన్ 1 వరకు ఇంటర్ కాలేజీలకు సెలవులు
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులను ఇంటర్మీడియట్ బోర్డ్ (TSBIE) ప్రకటించింది. మార్చి 30వ తేదీన వేసవి సెలవులు ప్రారంభమయ్యాయని.. జూన్ 1వ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగుతాయని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలన్నీ ఈ వేసవి సెలవులను తప్పనిసరిగా పాటించాలని ఇంటర్ బోర్డు సూచించింది. వేసవి సెలవుల్లో ఏదైనా కాలేజీలు అనధికారికంగా క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డ్ హెచ్చరించింది.
ఎవరైనా అనధికారికంగా తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిస్తే ఇంటర్ బోర్డు దృష్టికి తీసుకురావాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించింది. తిరిగి జూన్ 2వ తేదీన కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులను విద్యార్థులు స్వీయ అధ్యయనం, స్కిల్ డెవలప్‌మెంట్ కొరకు వినియోగించుకోవాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ సూచనలు చేసింది.
తెలంగాణ టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి మొదలయ్యాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకూ జరగనున్నాయి. తెలంగాణలో కూడా ఏపీలో లాగే పదో తరగతి పరీక్షా ఫలితాలు ఏప్రిల్ నెలాఖరు కల్లా వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. తెలంగాణ టెన్త్ ఫలితాల అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/ చెక్ చేసుకుంటూ ఉండొచ్చు.