Inter college students: ఎంసెట్‌కు ఎప్పుడు చదవాలి?

Written by RAJU

Published on:

ఇంటర్‌లో తొలిసారిగా థియరీ తర్వాత ప్రాక్టికల్‌ పరీక్షలు

ఏప్రిల్‌ 25 వరకు కొనసాగనున్న ప్రక్రియ..

ఆ వెంటనే మేలో ఎంసెట్‌

జేఈఈ పరీక్షలకూ సన్నద్ధమవ్వాలి..

ఆందోళనలో ఇంటర్‌ విద్యార్థులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియెట్‌ విద్యామండలి (Board of Intermediate Education) తాజాగా విడుదల చేసిన పరీక్షల షెడ్యూలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏటా తొలుత ప్రాక్టికల్స్‌, అనంతరం థియరీ పరీక్షలు జరుగుతాయి. కానీ, తొలిసారి ప్రాక్టికల్స్‌ను థియరీ పరీక్షల తర్వాత నిర్వహించబోతున్నారు. మార్చి 15న థియరీ పరీక్షలు(Theory tests) ప్రారంభమై ఏప్రిల్‌ 4న ముగుస్తాయి. అనంతరం ఏప్రిల్‌ 15 నుంచి 25 వరకు ప్రాక్టికల్స్‌(Practicals) నిర్వహించబోతున్నారు. ఏటా ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్‌ పరీక్షలు, మార్చిలో థియరీ పరీక్షలు జరిగేవి. ప్రాక్టికల్స్‌ ముగిస్తే విద్యార్థులు థియరీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు. అవి పూర్తికాగానే ఎంసెట్‌(Emset), జేఈఈ(JEE), ఇతర వర్సిటీల ప్రవేశ పరీక్షలకు చదువుకునేందుకు సమయం ఉండేది. కానీ, ఈ ఏడాది ఇంటర్‌ బోర్డు తీసుకున్న నిర్ణయంతో ఏప్రిల్‌ నెలాఖరు వరకు ఇంటర్‌ పరీక్షలతోనే సరిపోతుంది. ఆ తర్వాత మేలో నిర్వహించే ఎంసెట్‌ సన్నద్ధతకు ఎక్కువ సమయం ఉండదు.

అలాగే, జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు మొదటి సెషన్‌ జనవరి 24 నుంచి 31 వరకు, రెండో సెషన్‌ ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు జరుగుతాయి. ఈ ఏడాది వాటికోసం చదివే సమయం కూడా విద్యార్థులకు ఎక్కువ ఉండదు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమైనందున ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, కొవిడ్‌(covid) నేపథ్యంలో గతేడాది కూడా విద్యా సంవత్సరం ఆలస్యంగానే ప్రారంభమైనా ప్రాక్టికల్స్‌ను థియరీ తర్వాతకు మార్చలేదు. సాధారణంగా మేలో జరిగే ఎంసెట్‌ పరీక్షకు 40రోజులు ముందుగా(మార్చిలోనే) నోటిఫికేషన్‌ జారీచేస్తారు. ఇంటర్‌ థియరీ పరీక్షలు ముగిసే సమయంలోనే ఎంసెట్‌ హడావుడి మొదలవుతుంది. కానీ, ఇప్పుడు విద్యార్థులు ఎంసెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టేందుకు వీల్లేకుండా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

పెరిగిన ప్రవేశ పరీక్షలు..

గతంలో ఇంటర్‌ అనంతరం ఎంసెట్‌ పరీక్షే విద్యార్థులకు ప్రధానంగా కనిపించేది. కానీ, ఇప్పుడు జేఈఈ పరీక్షలు రాసేవారి సంఖ్య పెరిగింది. దాంతోపాటు వివిధ ప్రైవేటు యూనివర్సిటీల ప్రవేశ పరీక్షలకూ విద్యార్థులు హాజరవుతున్నారు. ఏపీలో ఏర్పాటైన వీఐటీ, ఎస్‌ఆర్‌ఎం వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తాయి. కొత్తగా మోహన్‌బాబు యూనివర్సిటీ(Mohan Babu University) కూడా ఆ జాబితాలోకి వచ్చింది. అలాగే మరో రెండు ప్రైవేటు యూనివర్సిటీలు కూడా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. దీంతోపాటు ఏపీ విద్యార్థులు చాలా మంది తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష కూడా రాస్తారు. ఇటీవల పోటీ పెరగడంతో వీలైనన్ని ఎక్కువ ప్రవేశ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. వాటి సన్నద్ధతకు ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు అడ్డంకిగా మారే పరిస్థితి ఏర్పడనుంది.

సిలబస్‌ వల్లే మార్చాం..

ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనందున కళాశాలల పనిదినాలు సిలబస్‌ పూర్తి చేయడానికి సరిపోవడం లేదు. ఫిబ్రవరి నాటికి సిలబస్‌ పూర్తికాదు. ఆ సమయంలో ప్రాక్టికల్స్‌ పెడితే థియరీ పరీక్షలపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల థియరీ పరీక్షల్లో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రాక్టికల్స్‌ను తర్వాత నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు కేటాయించిన రోజుల్లోనే ప్రాక్టికల్స్‌ ఉంటాయి. అందువల్ల ప్రవేశ పరీక్షలకు ఇబ్బంది ఉండదు

-శ్రీనివాసులు, కంట్రోలర్‌, ఇంటర్మీయట్‌ పరీక్షల విభాగం

Subscribe for notification