Indus Waters Treaty: పాక్‌కు చావుదెబ్బ.. సిందూ నదీ జలాల ఒప్పందం రద్దు చేసిన భారత్‌..!

Written by RAJU

Published on:

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి చావుదెబ్బగా కేంద్రం వరుస చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా బుధవారం (ఏప్రిల్ 23) సింధు-జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. భారత సర్కార్‌ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం నదీజలాల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇరు దేశాల మధ్య విస్తరించి ఉన్న సింధూ నది, దాని ఉపనదుల జలాలను సాగు కోసం, జలవిద్యుత్‌ వంటి తదితర అవసరాల కోసం వినియోగించుకునేందుకుగాను భారత్, పాకిస్తాన్‌ 6 దశాబ్దాల క్రితం చేసుకున్న ఒప్పందమే ఇది. దాదాపు తొమ్మిదేళ్లపాటు విస్తతస్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్‌ 19వ తేదీన నాటి భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ, పాకిస్తాన్‌ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌లు ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంపై ప్రపంచ బ్యాంకు కూడా సంతకం చేసింది. ఒప్పందంలో పేర్కొన్న మేరకు సింధూ ఉపనదుల్లో తూర్పువైపుగా ప్రవహించే రావి, బియాస్, సట్లైజ్‌ నదులపై భారత్‌కు హక్కులు దక్కాయి. అలాగే సింధూ ఉపనదుల్లో పశ్చిమ దిశగా ప్రవహించే జీలం, చినాబ్‌లపై పాకిస్తాన్‌కు హక్కులు లభించాయి.

ఈ నదీ జలాల వినియోగం, ఇరు దేశాల మధ్య ఉత్తరప్రత్యుత్తరాల కోసం ఒక సహకార యంత్రాంగాన్ని కూడా నెలకొల్పారు. ఆ ఆరు ఉమ్మడి నదులను నియంత్రించే ఒప్పందం ప్రకారం ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా పరస్పర సహకారం భావనతో నదీజలాలను పాక్షికంగా సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. తూర్పు నదులైన సట్లెజ్, బియాస్, రావి నుంచి ఏడాదికి దాదాపు 33 మిలియన్ ఎకరాల అడుగుల (MAF) నీటిని భారతదేశానికి అనియంత్రిత వినియోగం కోసం కేటాయించారు. ఇక పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ ల నుంచి ఏటా దాదాపు 135 MAF జలాలు పాకిస్తాన్‌కు ఇవ్వడం జరుగుతుంది. అయితే పశ్చిమ దిశగా ప్రయాణించే జలాలు పాకిస్తాన్‌లోకి వెళ్లకుండా భారత్ అడ్డుకోకూడదు. ఈ ఒప్పందంలో భాగంగానే గతంలోనే శాశ్వత సింధూ కమిషన్‌ను ఏర్పాటుచేశారు.

పశ్చిమ నదులపై నదీ ప్రాజెక్టుల ద్వారా జలవిద్యుత్ ఉత్పత్తి చేసే హక్కు భారతదేశానికి ఇవ్వబడింది. పశ్చిమ నదులపై భారత జలవిద్యుత్ ప్రాజెక్టుల రూపకల్పనపై అభ్యంతరాలు వ్యక్తం చేసే హక్కును పాకిస్తాన్‌కు ఈ ఒప్పందం ఇస్తుంది. ఈ కమిషన్‌లో ఇరు దేశాలకు ప్రాతినిధ్యం ఉంది. ఇరు దేశాలు తమ అభ్యంతరాలను ఈ శాశ్వత కమిషన్‌ ద్వారా చెప్పుకోవచ్చు. ఈ నదీజలాలపై ఉద్దేశపూర్వకంగా డ్యామ్‌లను నిర్మించి, హఠాత్తుగా నీటిని వదిలి నష్టం చేకూర్చకూడదని షరతు కూడా పెట్టుకున్నాయి. సింధు నదీ వ్యవస్థలోని నదీ జలాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని భారత ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రభుత్వం సమానంగా కోరుకుంటున్నాయి. ఇందుకోసం చేసుకున్న ఒప్పందంపై అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ మహ్మద్ అయూబ్ ఖాన్ నాయకత్వంలో సంతకం చేశారు. అంతేకాకుండా ఇద్దరు కమిషనర్లు కనీసం ఏడాదికి ఒకసారి భారత్‌, పాకిస్తాన్‌లలో ప్రత్యామ్నాయంగా సమావేశం కావాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అయితే మార్చి 2020లో న్యూఢిల్లీలో జరగాల్సిన సమావేశం COVID-19 మహమ్మారి దృష్ట్యా రద్దు చేయబడింది. అలాగే రెండు ప్రభుత్వాల మధ్య ప్రయోజనాల కోసం ఒప్పందంలోని నిబంధనలను కాలానుగుణంగా సవరించవచ్చు. ఈ మేరకు ఈ ఒప్పందం ప్రవేశికలో ఉంది. అయితే భారత్, పాక్‌ల మధ్య గతంలో 1965, 1971, 1999లో యుద్ధాలు జరిగినా సింధు జలాల ఒప్పందానికి ఎలాంటి ఆటంకాలు రాలేదు. గడచిన 60 ఏళ్ల ఈ నదీప్రవాహాల వెంట భౌగోళికంగా, పర్యావరణపరంగా చాలా మార్పులొచ్చాయి. జీలంకు ఉపనది అయిన కిషన్‌గంగ నదిపై భారత్‌ జలవిద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించింది. దీనిపై పాకిస్తాన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టు కారణంగా పాక్‌కు నదీ జలాలు సరిపడా అందడంలేదని లబోదిబోమంటోంది. ఆ క్రమంలో ఇరుదేశాల మధ్య వివాదాలు ఎక్కువయ్యాయి. ఈ పంచాయతీని పాక్ ప్రపంచబ్యాంక్‌ దాకా తీసుకెళ్లింది. తాజాగా ఈ ఒప్పందం నుంచి భారత్‌ వైదొలగడంతో కేంద్రం తనకు నచ్చినట్లు జీలం, చినాబ్, రావి, బియాస్, సట్జైజ్‌ నదీజలాలు పాకిస్తాన్‌కు స్వేచ్ఛగా ప్రవహించకుండా డ్యామ్‌లు కట్టేందుకు వీలుంటుంది. అప్పుడు పాకిస్తాన్‌కు నీటి కష్టాలు తప్పవు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights