దేశవ్యాప్తంగా 60 రైల్వే స్టేషన్లలో విమానాశ్రయం లాంటి భద్రత, జనసమూహ నియంత్రణ ఏర్పాట్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది రైల్వే. ఇప్పుడు రైలు వచ్చిన తర్వాత ప్రయాణికులను ప్లాట్‌ఫారమ్‌పైకి వెళ్లడానికి అనుమతిస్తారు. రైల్వే బోర్డు ప్రకారం.. యాక్సెస్ కంట్రోల్ ఎంట్రీ సిస్టమ్ అమలు చేయనున్నారు. కొత్త నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత జనరల్, వెయిటింగ్ టికెట్ ఉన్నవారు స్టేషన్‌లోకి ప్రవేశించలేరు. కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారిని మాత్రమే స్టేషన్‌లోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఈ విధానం దేశవ్యాప్తంగా 60 ప్రధాన రైల్వే స్టేషన్లలో అమలు చేయనున్నారు. రద్దీని నివారించడం, ప్రయాణికుల భద్రతను పెంచడంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టింది. ఈ విధానం త్వరలో ప్రధాన నగరాల్లోని కీలక రైల్వే స్టేషన్లలో అమలు కానుంది.
భారతీయ రైల్వే స్టేషన్లలో తరచుగా రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సెలవులు, పండుగల సమయాల్లో చాలా మంది బంధువులను దింపడానికి లేదా రిసీవ్ చేసుకునేందుకు వస్తారు. ఈ కొత్త నియమం అనవసరమైన రద్దీని తగ్గించి, ప్రయాణికుల కదలికను సులభతరం చేస్తుందని భావిస్తున్నారు.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (ఢిల్లీ), ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (ముంబై), హౌరా జంక్షన్ (కోల్‌కతా), చెన్నై సెంట్రల్ (చెన్నై, బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ (బెంగళూరు) సహా 60 అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు చేయనుంది.
ఈ విధానం తాత్కాలిక అసౌకర్యానికి కారణం కావచ్చు. కానీ చివరికి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని, స్టేషన్‌కు చేరుకునే ముందు వారికి టికెట్స్ కన్ఫర్మ్ అయి రిజర్వేషన్ ఉందని నిర్ధారించుకోవాలని అధికారులు సూచించారు. ఇది టిక్కెట్టు ఉన్న ప్రయాణికులను మాత్రమే అనుమతించడం ద్వారా ప్లాట్‌ఫారమ్ రద్దీని నిర్వహించడానికి సహాయపడుతుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షతన జరిగిన సమావేశం తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి