ABN
, Publish Date – Apr 18 , 2025 | 01:41 AM
భారత మార్కెట్లు ట్రంప్ సుంకాల విరామం, వాణిజ్య చర్చల ఆశలతో జోరుగా లాభపడ్డాయి. నాలుగు రోజుల ర్యాలీలో సెన్సెక్స్ 4706 పాయింట్లు, నిఫ్టీ 1452 పాయింట్లు పెరిగాయి

ముంబై: ట్రంప్ సుంకాల పోటుకు కుదేలైన ఈక్విటీ మార్కెట్ తదనంతరం ఏర్పడిన ఆశావహ సంకేతాలతో అంతకు మించిన ర్యాలీలో దూసుకుపోయింది. సుంకాలకు ట్రంప్ ప్రకటించిన 90 రోజు ల విరామం, భారత-అమెరికా వాణిజ్య చర్చలు ఫలవంతం కావచ్చునన్న ఆశలు మార్కెట్లో జవసత్వాలు నింపాయి. దీనికి తోడు విదేశీ ఇన్వెస్టర్లు కూడా భారత ఈక్విటీలపై మరోసారి దృష్టి సారించారు. ఫలితంగా వరుసగా నాలుగో రోజు కూడా కొనసాగిన ర్యాలీలో సెన్సెక్స్ 1508.91 పాయింట్లు దూసుకుపోయి 78,553.20 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 414.45 పాయింట్ల మేరకు లాభపడి 23,851.65 వద్ద ముగిసింది. నాలుగు రోజుల ర్యాలీలో సెన్సెక్స్ 4706.05 పాయింట్లు, నిఫ్టీ 1452.50 పాయింట్లు లాభపడ్డాయి.
బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 0.56 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.52 శాతం లాభపడ్డాయి.
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) గురువారం రూ.4667.94 కోట్ల విలువ గల షేర్లు కొనుగోలు చేశారు.
ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.70 పెరిగి మరో జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.98,170 వద్ద ముగిసింది.
అమెరికన్ డాలర్ మారకంలో 26 పైసలు పెరిగి 85.38 వద్ద ముగిసింది.
Updated Date – Apr 18 , 2025 | 01:43 AM