- మా దేశంలో భారీ దాడులకు భారత్ ప్లాన్ చేస్తోంది..
- సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ రక్షణ మంత్రి..
- భారతీయులు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిక..

Pakistan: పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ లోలోపల భయపడుతూనే, భారత ప్రతీకారాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎల్ఓసీ వద్ద పాకిస్తాన్ తన సైన్యాన్ని మోహరించింది. ఈ రోజు పాక్ ప్రధాని షెహజాబ్ షరీఫ్ నేతృత్వంలో హై లెవల మీటింగ్ జరిగింది. దీని తర్వాత, భారత్‌పై ప్రతీకార చర్యలకు పాల్పడింది. భారత విమానాలకు పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసేయడంతో పాటు ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపేస్తున్నట్లు, వాణిజ్యాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
Read Also: Rahul Gandhi: ‘‘ఏ చర్యకైనా ఫుల్ సపోర్ట్ ఉంటుంది’’.. కేంద్రానికి రాహుల్ గాంధీ మద్దతు..!
ఇదిలా ఉంటే, తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్ పూర్తి యుద్ధానికి బదులుగా, విస్తృత ఉగ్రవాద దాడిని ప్లాన్ చేస్తోంది’’అని ఆరోపించారు.”మా సమాచారం ప్రకారం, భారతదేశం పూర్తి యుద్ధానికి బదులుగా పాకిస్తాన్ అంతటా విస్తృత ఉగ్రవాద దాడులను ప్లాన్ చేస్తోంది. ఆ ఉగ్రవాద దాడుల్ని మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. అయితే, అలా జరిగితే, అది ప్రతిఫలంగా ఉంటుంది. పాక్ పౌరులు సురక్షితంగా లేకుంటే, వారిపై దాడి జరిగితే, భారత పౌరులు సురక్షితంగా ఉండరు. భారత్ చేసిన దాడి కారణంగా ఒక్క పాకిస్తాన్ పౌరుడు మరణించినా, భారతదేశం భారీ మూల్యం చెల్లించేలా చేస్తాం” అని ఆసిఫ్ అన్నారు.
పాకిస్తాన్ తన సార్వభౌమాధికారం, భద్రతకు ఏదైనా ముప్పు కలిగితే దృఢమైన ప్రతిస్పందన ఎదుర్కుంటారని భారత్‌కి వార్నింగ్ ఇచ్చింది. భారత్ రాజకీయ ఎజెండానున ముందుకు తీసుకెళ్లడానికి పహల్గామ్ వంటి సంఘటనల్ని వాడుకుంటుందని పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశం తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. సింధు జలాల ఒప్పందం రద్దుని ‘‘యుద్ధ చర్య’’గా పాకిస్తాన్ అభివర్ణించింది.