- న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ జట్టు
- మరోమారు ఘోర పరాజయం పాలైన పాకిస్తాన్
- మొదటి టి20లో 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం.

NZ vs Pak: న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ జట్టుకు ఊహించని ఆరంభం ఎదురైంది. క్రైస్ట్‌చర్చ్ లోని హెగ్లీ ఓవల్ మైదానంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు పూర్తిగా విఫలమైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో పాకిస్తాన్ జట్టు ఓటమిని తప్పించుకోలేకపోయింది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు అద్భుత ప్రదర్శనతో సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. న్యూజిలాండ్ టాస్ గెలిచి పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి న్యూజిలాండ్ బౌలర్లు రెచ్చిపోయారు. పాకిస్తాన్ ఓపెనర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఓపెనర్లు ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు. ఆ సమయంలో కేవలం ఒక్క పరుగుకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీనితో పాకిస్తాన్ జట్టు కేవలం 18.4 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ తరఫున ఖుష్దిల్ షా 32 పరుగులు చేయగా, జహానదాద్ ఖాన్ 17 పరుగులతో పాకిస్థాన్ కాస్త గౌరవప్రదమైన స్కోరును అందుకుంది. ఇక న్యూజిలాండ్ బౌలింగ్ విభాగంలో జాకబ్ డఫీ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను 4 వికెట్లు తీసి పాకిస్తాన్ బ్యాటింగ్‌ను పూర్తిగా దెబ్బతీశాడు. మరోవైపు కైల్ జామిసన్ కూడా, 4 ఓవర్లలో కేవలం 8 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఈష్ సోది 2 వికెట్లు, జాకరీ ఫౌల్కెస్ 1 వికెట్ సాధించారు.
Read Also: IPL Purple Cap Holders: బ్యాట్స్మెన్స్ దూకుడికి కళ్లెం వేసి ఐపీఎల్ చరిత్రలో ‘పర్పుల్ క్యాప్’ సాధించిన ఘనులు వీరే
ఇక స్వల్ప లక్ష్యంతో ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన న్యూజిలాండ్ మ్యాచ్ ముగించడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. కేవలం 10.1 ఓవర్లలో అంటే 61 బంతుల్లోనే విజయం సాధించారు. ఇక న్యూజిలాండ్ ఇన్నింగ్స్ స్టిమ్ సీఫర్ట్ 29 బంతుల్లో 44 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. ఆ తర్వాత వచ్చిన ఫిన్ అలెన్ 17 బంతుల్లో 29 పరుగులు నాటౌట్, టిమ్ రాబిన్సన్ 15 బంతుల్లో 18 పరుగులతో అజేయంగా నిలిచారు. పాకిస్తాన్ బౌలింగ్ విభాగంలో ఒకే ఒక్క వికెట్ ను అబ్రార్ అహ్మద్ సాధించాడు. మిగతా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు.