
Hyderabad Metro: 2017లో ప్రారంభమమైన హైదరాబాద్ మెట్రో రైలు సేవలు దేశంలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) ప్రాజెక్టుగా నిలిచింది. ఈ మెట్రో సేవలు నగరంలోని ముఖ్య ప్రాంతాలను కలుపుతూ ప్రతిరోజూ లక్షలాది మందికి సేవలందిస్తున్నాయి. అధిక రహదారి ట్రాఫిక్, కాలుష్య సమస్యల నేపథ్యంలో మెట్రో సేవలు నగర ప్రజల దైనందిన జీవితంలో ఒక భాగంగా మారాయి. ఇకపోతే తాజాగా హైదరాబాద్ మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ (L&T) సంస్థ రూ.6,500 కోట్లకు పైగా నష్టాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో భాగంగా మెట్రో రైల్ ఛార్జీల పెంపు తప్పదన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఇప్పటికే ప్రయాణికులకు అందిస్తున్న కొన్ని డిస్కౌంట్ ల విధానాలను తొలగించడం కూడా దీనికి సంకేతంగా భావిస్తున్నారు.
ఇదివరకు కోవిడ్-19 ప్రభావంతో తీవ్ర ఆర్థిక నష్టాలు వాటిల్లగా.. అప్పటి ప్రభుత్వం మెట్రో చార్జీల పెంపునకు కేంద్రాన్ని కోరింది. అందుకు ‘మెట్రో రైల్వే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ – 2002’ ఓ కమిటీ ప్రయాణికుల అభిప్రాయాలు, ఎల్ అండ్ టీ ప్రతిపాదనలు పరిశీలించి చార్జీల పెంపును ఆమోదించింది. అయితే చివరకు ప్రభుత్వం ఆ పెంపును ఆమోదించలేదు. అయితే, ఇప్పుడు ఎల్ అండ్ టీ సంస్థ రద్దీ సమయాల్లో ఇచ్చే 10 శాతం డిస్కౌంట్‌ను తొలగించింది. అలాగే, రూ.59 విలువైన హాలిడే సేవర్ కార్డు సేవను కూడా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోలో కనిష్ఠ ఛార్జీ రూ.10, గరిష్ఠ ఛార్జీ రూ.60 ఉండగా., దీనిపై ఎంతవరకు పెరగొచ్చనే స్పష్టత ఇంకా లేదు. కాబట్టి అతి త్వరలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణం కాస్త భారం కాబోతున్నట్లు అర్థమవుతుంది.