Hyderabad House Robbery: నగరంలో భారీ చోరీ.. ఇఫ్తార్‌ విందుకు వెళ్లివచ్చేసరికి ఇళ్లంతా ఊడ్చేశారు!

Written by RAJU

Published on:

Hyderabad House Robbery: నగరంలో భారీ చోరీ.. ఇఫ్తార్‌ విందుకు వెళ్లివచ్చేసరికి ఇళ్లంతా ఊడ్చేశారు!

హైదరాబాద్‌, మార్చి 18: రంజాన్‌ మాసం కావడంతో ఇఫ్తార్ విందుకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి విలువైన వస్తువులు దోచుకెళ్లారు కెటుగాళ్లు. షేక్‌పేటలోని డైమండ్ హిల్స్ కాలనీలోని ఒక ఇంట్లోకి చొరబడిన దొంగలు లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌ ఫిలింనగర్‌ సమీపంలోని షేక్‌పేట్‌లో సోమవారం (మార్చి 17) చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

షేక్‌పేట సమీపంలోని డైమండ్ హిల్స్ కాలనీకి చెందిన మహ్మద్ ముజాహిద్ కమల్ అనే వ్యక్తి కుటుంబంతో పాటు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌కు వచ్చిన ఆయన రంజాన్ మాసం కావడంతో సోమవారం ఉదయం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో సహా ఇఫ్తార్ విందుకోసం బంధువుల ఇంటికి వెళ్లారు. అయితే ఇదే అదనుగా దొంగలు ఆ ఇంటి ప్రధాన ద్వారం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. దాదాపు 32 తులాల బంగారం, రూ.3 లక్షల నగదుతో ఉడాయించారు.

ఈ విషయం తెలియని యజమాని మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సంమయంలో ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ ఇంటి వెనక తలుపు పగలగొట్టి ఉండటం చూసి ఆందోళన చెందిన ముజాహిద్ లోనికి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందర వందరగా పడిపోయి కనిపించాయి. బెడ్రూంలలో అల్మారాలు పగలగొట్టి అందులోని 34 తులాల బంగారు ఆభరణాలతో పాటు సుమారు రూ 4.5 లక్షల నగదు, 550 కెనడియన్‌ డాలర్లు ఎత్తుకెళ్లారు. దుండగులు ముందు జాగ్రత్తగా ఇంటిలోని సీసీకెమెరాలను కూడా ధ్వంసం చేశారు. ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్రైమ్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని ధారాలు సేకరించింది. నిందితుల ఆచూకీ కోసం సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Subscribe for notification