- నగరంలో మరోసారి హిట్ అండ్ రన్ ఘటన
- నార్సింగిలో జరిగిన ఈ ఘోర ప్రమాదం
- ప్రాణాలు కోల్పోయిన యువ ఇంజినీర్

హైదరాబాద్ నగరంలో మరోసారి హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. నార్సింగిలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో యువ ఇంజనీర్ నవీన్ చారీ ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో ఆసక్తితో, ఆశలతో తన మొదటి ఉద్యోగం ప్రారంభించిన నవీన్ చారీ ఆ రోజు పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది. కోకాపేట్ టీ-గ్రీల్ వద్ద నవీన్ చారీ తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం అతడిని వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు నవీన్ చారీ తీవ్ర గాయాల పాలయ్యాడు. రహదారిపై అపస్మారక స్థితిలో పడిపోయిన అతడిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, హుటాహుటిన నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత..
డాక్టర్లు నవీన్ చారీని అత్యవసర చికిత్సకు తీసుకెళ్లినా, అతడి గాయాల తీవ్రత కారణంగా ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే నవీన్ మృతి చెందాడు. ఈ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నార్సింగి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపడుతున్నారు.
కుటుంబం కన్నీటి పర్యంతం..
నవీన్ చారి తల్లిదండ్రులకు ఈ సంఘటన వర్ణనాతీత వేదనగా మారింది. ఎంతో కష్టపడి చదివించి, ఉద్యోగం చేయడానికి పంపిన కుమారుడు మొదటి రోజే శవమై ఇంటికి తిరిగి రావడం తల్లిదండ్రుల హృదయాలను ఛిద్రం చేసింది.
హైదరాబాద్‌లో పెరుగుతున్న హిట్ అండ్ రన్ కేసులు
ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో హిట్ అండ్ రన్ ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వేగంగా వాహనాలు నడిపే నిర్లక్ష్య డ్రైవర్లు అమాయక ప్రాణాలను బలిగొంటున్నారు. రహదారి భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ హిట్ అండ్ రన్ ఘటన మరో కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. నవీన్ చారి కుటుంబానికి జరిగిన ఈ అన్యాయం బాధను మాటల్లో వ్యక్తం చేయలేం. ఈ ఘటనకు బాధ్యులైన వారిని పోలీసులు త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని జనాలు కోరుతున్నారు.