Hyderabad: హోలీ వేడుకల్లో గంజాయి కుల్ఫీ, బర్ఫీ

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Mar 15 , 2025 | 05:06 AM

గంజాయి వ్యాపారులు జనాన్ని మత్తుకు బానిసలను చేసేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇన్నాళ్లూ హష్‌ఆయిల్‌, చాక్లెట్ల రూపంలో గంజాయిని విక్రయించిన ఆయా ముఠాలు.. ఇప్పుడు ఏకంగా గంజాయితో కుల్ఫీలు, బర్ఫీలను తయారు చేసి వాటిని గుట్టుగా జనంలోకి వదిలేస్తున్నాయి.

Hyderabad: హోలీ వేడుకల్లో గంజాయి కుల్ఫీ, బర్ఫీ

  • గంజాయితో చేసిన 100 కుల్ఫీలు, 72 బర్ఫీలు ధూల్‌పేటలో స్వాధీనం

  • ముత్తంగిలో 84 గంజాయి చాక్లెట్లు పట్టివేత

హైదరాబాద్‌ సిటీ, పటాన్‌చెరు, మార్చి 14(ఆంధ్రజ్యోతి): గంజాయి వ్యాపారులు జనాన్ని మత్తుకు బానిసలను చేసేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇన్నాళ్లూ హష్‌ఆయిల్‌, చాక్లెట్ల రూపంలో గంజాయిని విక్రయించిన ఆయా ముఠాలు.. ఇప్పుడు ఏకంగా గంజాయితో కుల్ఫీలు, బర్ఫీలను తయారు చేసి వాటిని గుట్టుగా జనంలోకి వదిలేస్తున్నాయి. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన హోలీ వేడుకల్లో ఈ గంజాయి కుల్ఫీ ఐస్‌క్రీములు, బర్ఫీల గుట్టు బయటపడింది. హోలీ వేడుకల ముసుగులో కొందరు మత్తు పదార్థాలను వినియోగిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్‌ ఎస్టీఎఫ్‌ (స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌) పోలీసులు లోయర్‌ దూల్‌పేట్‌లోని మల్చిపురాలో జరిగిన హోలీ వేడుకలపై దాడి చేశారు. ఎస్టీఎఫ్‌ టీమ్‌ లీడర్‌ అంజిరెడ్డి నేతృత్వంలో దాడి చేసిన ఎక్సైజ్‌ పోలీసులు గంజాయి కలిపి తయారు చేసిన కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లు, బర్ఫీ మిఠాయిలను గుర్తించారు. బర్ఫీ స్వీట్లను సిల్వర్‌ పేపర్‌తో చుట్టి బంతుల్లా తయారు చేసి ఉండడాన్ని గమనించారు.

గంజాయి కలిపిన 100 కుల్ఫీలు, 72 బర్ఫీలను ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నారు. ఇక, సత్యనారాయణ సింగ్‌ అనే వ్యక్తి ఈ ఐస్‌క్రీమ్‌లను తయారు చేసి విక్రయిస్తున్నట్టు తేలడంతో అతనిపై కేసు నమోదు చేశారు. సత్యనారాయణ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇక, గంజాయి కుల్ఫీలు, బర్ఫీలను పట్టుకున్న సిబ్బందిని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వీవీ కమలాసన్‌రెడ్డి అభినందించారు. కాగా, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామంలోని ఓ ఇంట్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని మెదక్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది శుక్రవారం సాయంత్రం దాడి చేసి పట్టుకున్నారు. అతని నుంచి 465 గ్రాముల బరువున్న 84 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని అంచనా. ఈ గంజాయి చాక్లెట్ల విక్రయానికి సంబంధించి బిహార్‌కు చెందిన నితీ్‌షకుమార్‌ (25)ను అరెస్టు చేశారు. ముత్తంగిలోని ఓ హోటల్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్న నితీష్‌ కుమార్‌ బిహార్‌ నుంచి గంజాయి చాక్లెట్లు తెప్పించి స్థానికంగా విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది.

Updated Date – Mar 15 , 2025 | 05:06 AM

Google News

Subscribe for notification