Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఇకపై అలా చేశారంటే వేలల్లో ఫైన్.. ఇంటికొచ్చి మరి.. – Telugu News | Man fined for using drinking water to wash bike in Hyderabad Watch Video

Written by RAJU

Published on:

కోటిమందికి పైగా జనాభా.. అసలే ఎండాకాలం.. జలమండలి ఇచ్చే తాగునీరు సరిపోని పరిస్థితి. ఈ క్రమంలో జలమండలి చర్యలు చేపట్టింది. అందరికీ తాగునీరు అందించాలని.. కీలక ప్రాంతాల్లో రోజు విడిచి రోజు నీళ్లు ఇస్తున్నా, మరికొన్ని ప్రాంతాల్లో మూడు, నాలుగు రోజులకు ఒకసారి నీళ్లిస్తూ.. అందరికీ దాహార్తిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు జలమండలి అధికారులు. ఇదే సమయంలో తాగునీటిని వృథా చేసే వారిపై కఠిన చర్యలకు దిగుతున్నారు. తాగునీటిని టూవీలర్లు, కార్లను వాష్ చేయడానికి వాడే వారికి పట్టుకుని ఫైన్ వేస్తున్నారు. సమ్మర్‌లో నీటి వృథాను అరికట్టేందుకు ఔటర్ రింగ్ రోడ్డు లోపల జలమండలి అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇటీవల జూబ్లీహిల్స్‌లో తన ఇంటి ముందు తాగునీటితో బైక్ వాష్ చేసిన వ్యక్తికి వెయ్యి రూపాయలు జరిమానావేయగా.. తాజాగా ఇలాంటి పనే చేసిన వ్యక్తికీ కూడా వెయ్యి రూపాయల ఫైన్ వేశారు.

తాగునీటి వృథాపై జ‌ల‌మండ‌లికి ఫిర్యాదులు భారీగా అందుతున్నాయి. క‌స్ట‌మ‌ర్ కేర్‌కు ఫోన్ చేయ‌డంతో పాటు ఆయా ప్రాంతాల్లో నేరుగా అధికారుల‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో జీఎంలు త‌మ ప‌రిధిలో.. తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే స‌మ‌యంలో సిబ్బందితో కలిసి త‌నిఖీలు చేస్తున్నారు.

ఎవ‌రైనా తాగునీరు వృథా చేసిన‌ట్లు గ‌మ‌నిస్తే.. వెంట‌నే నోటీసులు జారీ చేసి జ‌రిమానా విధిస్తున్నారు. ఈ క్రమంలో డివిజ‌న్-6 జీఎం హ‌రిశంక‌ర్.. త‌మ మేనేజ‌ర్‌తో క‌లిసి త‌నిఖీలు చేశారు. శోభ అనే మహిళ తాగునీటితో వాహనం శుభ్రం చేయడం గుర్తించి వెయ్యి రూపాయల ఫైన్ వేశారు.

వీడియో చూడండి..


రోజు కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. కృష్ణా, గోదావరి నదుల నుంచి హైదరాబాద్‌ నగరానికి తాగునీరు తీసుకొస్తున్నామని.. ఎవరైనా తాగునీటిని వృథా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification