బట్టతలపై జుట్టు మొలిపిస్తానన్నాడు.. బిగ్‌బాస్‌లో పాల్గొన్న ఓ వ్యక్తి కూడా తాను నెత్తిపై దట్టంగా జుట్టు మొలిపించానని ప్రచారంతో ఊదరగొట్టాడు. పనిలో పనిగా త్వరలోనే హైదరాబాద్ వస్తున్నాను.. బట్టతల బాధితులంతా రెడీగా ఉండండి అని కూడా ప్రచారం చేయించుకున్నాడు. దాంతో బట్టతలతో ఇబ్బంది పడుతున్నవారంతా ఈ బట్టతల వైద్యుడి బుట్టలో పడ్డారు. గంటలతరబడి క్యూలో నిలబడి మరీ గుండుకొట్టించుకుని మందు రాయించుకొని వెళ్లారు. ఆ తర్వాత లబోదిబోమంటూ ఆస్పత్రులకు పరుగెత్తారు. సదరు బట్టతల వైద్యుడు మాత్రం డబ్బులన్నీ మూటగట్టుకొని గుట్టుచప్పుడు కాకుండా అక్కడినుంచి ఉడాయించాడు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో సంచలనంగా మారింది.
ఢిల్లీకి చెందిన వకీల్ అనే వ్యక్తి బట్టతలతో ఇబ్బందిపడుతున్న యువతను టార్గెట్ గా చేసుకొని భారీ మోసానికి తెరతీసాడు. బట్టతలపై సహజంగా వెంట్రుకలు మొలిపిస్తానంటూ తన సోషల్‌మీడియా వేదికగా ప్రకటన చేశాడు. సెలబ్రిటీలకు సైతం గుండుకొట్టి జుట్టు మొలిపించానని చెప్పాడు. ఈ క్రమంలో తాను ఏప్రిల్ 6న హైదరాబాద్ వస్తున్నానని, తన మిత్రుడికి హైదరాబాద్ పాతబస్తీలో సెలూన్ షాపు ఉందని అక్కడికి వస్తే బట్టతల బాధితుల సమస్య తీరుస్తానని తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. . చెప్పినట్టుగానే ఆదివారం హైదరాబాద్‌కు వచ్చాడు వకీల్. బట్టతలపై జుట్టు మొలుస్తుందని ఆశతో వందలమంది వకీల్ చెప్పిన సెలూన్ షాపుముందు క్యూ కట్టారు.
వీడియో చూడండి..
తలకు రూ.200లు వసూలు చేసి గుండుకొట్టి, ఏదో లిక్విడ్ తలకు రాసి పంపించాడు వకీల్. అంతేకాదు, తలపై రాసిన లిక్విడ్ ఆరిపోకుండా చూసుకోవాలని, తలను ఎప్పటికప్పుడు తడుపుతూ ఉండాలని సూచించాడు. తలకు ఒక బట్ట కట్టుకొని ఆరిపోకుండా నీళ్లుచల్లుతూ ఉండమని చెప్పాడు. గుండ్లు కొట్టించుకున్నవారంతా నెత్తిపై జుట్టును ఊహించుకుంటూ ఇంటికెళ్లారు. అయితే.. కొన్ని రోజులు అయ్యేసరికి.. తలపై రాసిన లిక్విడ్ తన ప్రభావాన్ని చూపింది. నెమ్మదిగా మంట రావడం మొదలైంది. ఆ తర్వాత తలంతా బొబ్బలెక్కిపోవడంతో చాలా మంది బాధితులు లబోదిబోమంటూ ఆస్పత్రికి పరుగులు తీశారు. కొన్ని వందలమందికి గుండ్లుకొట్టి డబ్బు మూటకట్టుకొని వకీల్ బిచానా ఎత్తేశాడు. లేని జుట్టుకోసం ఆశపడితే ఉన్నది ఊడిపోయిందంటూ బాధితులు వాపోయారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..