
బెట్టింగ్ అనే దానికి తెలంగాణలో చోటు లేదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. ఆ దిశగా బెట్టింగ్ యాప్‌లపై విచారణ చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్, రమ్మీ పట్ల కఠినంగా వ్యవహరించబోతున్నట్లు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు బెట్టింగ్ నిర్వాహకులపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా హఫీజ్‌పేట్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న దంపతులు అజయ్, సంధ్యలను SOT పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ముగ్గురు పంటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేక్ కంపెనీల పేరుతో బ్యాంక్ ఖాతాలు తెరిచి .. రెండు మ్యాచ్‌లపై రూ.40 లక్షల వరకు లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. మొత్తం ఏడు ఖాతాల ద్వారా వీరు ఈ బాగోతం నడిపినట్లు చెప్పారు. బ్యాంక్ అకౌంట్లలోని రూ.22 లక్షలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నిందితుడు అజయ్‌పై గతంలో నాలుగు బెట్టింగ్ కేసులు ఉన్నట్లు సమాచారం.
బెట్టింగ్ యాప్స్‌తో కనీసం వారానికో ప్రాణం గాల్లో కలుస్తోంది. ఈజీ మనీకి అలవాటు పడ్డ యువత..వీటి బారిన పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. తెలుగురాష్ట్రాల్లో రోజుకో చోట వినిపిస్తున్న బెట్టింగ్ మరణవార్త..అందర్నీ కలచివేస్తోంది. ఆరు నెలల కాలంలో దాదాపు 30మంది బెట్టింగ్‌యాప్స్‌కు బలయ్యారు. కష్టపడకుండానే డబ్బులు సంపాదించాలన్న అత్యాశే మనిషిని జూదం వైపు నెడుతుంది. ఒక్కసారి అటువైపు వెళ్లారా… జీవితం నాశనమే. బెట్టింగుల జోలికి వెళ్లకండి. బెట్టింగులు ఆడుతున్నవారు ఇకనైనా మారండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.