ABN
, Publish Date – Mar 15 , 2025 | 05:18 AM
విదేశాల తరహాలో చెత్త డబ్బాల్లోని చెత్తను తొలగించే అధునాతన వ్యవస్థ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో స్మార్ట్‌బిన్‌లను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేస్తోంది.

విదేశాల తరహాలో చెత్త తొలగింపు.. చెత్తడబ్బా ఎంత నిండిదన్న సమాచారం అందుబాటులో
-
సెన్సార్లతో పని చేసేలా అధునాతన పరిజ్ఞానం
-
సిబ్బంది అవసరం లేకుండానే చెత్త తొలగింపు
హైదరాబాద్ సిటీ, మార్చి 14(ఆంధ్రజ్యోతి): విదేశాల తరహాలో చెత్త డబ్బాల్లోని చెత్తను తొలగించే అధునాతన వ్యవస్థ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో స్మార్ట్‌బిన్‌లను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేస్తోంది. మొదటి దశలో భాగంగా 350 స్మార్ట్ బిన్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటికే చార్మినార్ జోన్‌లో 180, ఖైరతాబాద్ జోన్‌లో 40 స్మార్ట్‌బిన్‌లను అందుబాటు లోకి తెచ్చారు. ఈ స్మార్ట్‌బిన్‌లలో సెన్సార్ వ్యవస్థ ఉంటుంది. దాంతో ఈ స్మార్ట్‌బిన్‌లలో 25 శాతం, 50 శాతం, 80 శాతం చెత్త నిండగానే ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది. 80 శాతం చెత్త నిండగానే సెన్సార్ ఏజెన్సీ సిబ్బంది, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్, శానిటరీ జవాన్, సహాయ వైదారోగ్య అధికారి/ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌లను అప్రమత్తం చేస్తుంది. దాంతో వెంటనే వాహనాన్ని పంపించి డబ్బాలోని చెత్తను తొలగిస్తారు. అయితే ఈ బిన్లలో చెత్తను తొలగించేందుకు ఏజెన్సీ ద్వారా ప్రత్యేక వాహనాన్ని తయారు చేయించారు. సిబ్బంది అవసరం లేకుండా డబ్బాలోని చెత్తను తొలగించేలా హుక్స్‌తో దానిని తయారు చేయించారు. ఈ వాహనం ద్వారానే ఇప్పటికే ఏర్పాటు చేసిన కొన్ని స్మార్ట్‌బిన్లలో చెత్తను తొలగిస్తున్నారు. ఏ ప్రాంతంలో ఏ చెత్త డబ్బా ఎంత మేర నిండిందనే సమాచారంతో పాటు, ఎప్పుడు వాటిలోని చెత్తను తొలగించారనే వివరాలు నమోదవుతాయని, దాంతో క్రమం తప్పకుండా చెత్త తొలగింపు జరుతుందని ఓ అధికారి చెప్పారు. గ్రేటర్ పరిధిలో రోడ్ల పక్కన, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే ప్రాంతాల్లో ఈ స్మార్ట్ బిన్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
నగరంలో పదేళ్ల క్రితం ఇంటింటి చెత్త సేకరణ ప్రారంభమైంది. ఇందుకోసం కార్మికులకు దశల వారీగా 4500 స్వచ్ఛ ట్రాలీలు అందించారు. అయితే చాలా ప్రాంతాల్లో చెత్త సేకరణ రోజూ జరగడం లేదు. దాంతో కొందరు చెత్తను రోడ్ల పక్కన పడేస్తున్నారు. అలాగే సేకరణ రుసుము రూ.150-200 ల వరకు వసూలు చేయడం, చెత్త సేకరణ సమయం అనువుగా లేకపోవడం, షిఫ్ట్‌ల ఉద్యోగాలు నేపథ్యంలో ఫలానా సమయంలోనే చెత్త ఇవ్వాలి అంటే కుదరకపోవడం వంటి కారణల వల్ల కూడా రోడ్ల పక్కన చెత్త చేరుతోంది. బిన్ ఫ్రీ సిటీ కోసం గతంలో నగరంలో చెత్త డబ్బాలను తొలగించారు. ఇంటింటి సేకరణ చేపట్టినప్పటికీ రోడ్డ పక్కన చెత్త చేరుతుండడంతో మళ్లీ చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది.
Updated Date – Mar 15 , 2025 | 05:18 AM