సాధారణంగా పండుగలప్పుడు, వార్షికోత్సవాలప్పుడు కొన్ని షోరూమ్‌లు వస్తువులపై భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఆ సమయంలో కస్టమర్స్ పెద్ద సంఖ్యలోతరలి వచ్చి తక్కువధరకు ఎక్కువ వస్తువులు వస్తుండటంలో భారీగా కొనుగోలు చేస్తుంటారు. అలా ఓ బట్టల షాపు యజమాని తన షోరూమ్ వార్షికోత్సవం సందర్భంగా ఒక్కరూపాయికే బ్రాండెడ్ డ్రస్ అంటూ భారీ ఆఫర్ ప్రటించాడు. ఆ తర్వాత ఆ యజమాని తిప్పలు మామూలుగా లేవు. చివరికి మమ్మల్ని రక్షించండి మహాప్రభో అంటూ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.
కొత్తబట్టలంటే యువతకు ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. నెలలో ఓ నాలుగు కొత్త డ్రస్సులైనా కొనాలనుకుంటారు. కానీ బడ్జెట్ గుర్తుకొచ్చి ఆగిపోతారు. అలాంటివారికి రూపాయికే బ్రాండెడ్ డ్రస్ వస్తుంది అంటే ఆగుతారా.. సైదాబాద్ సింగరేణి కాలనీ ప్రధాన రోడ్డుపై ఓ బట్టల షాపు ప్రారంభించి సంవత్సరం ముగిసింది. ఈ క్రమంలో తన షో రూం ప్రమోట్ చేసుకోవటానికి.. మార్కెటింగ్ స్టంట్‌లో భాగంగా ఓ పెద్ద ఆఫర్ పెట్టాడు ఆ షాపు యజమాని. కేవలం రూపాయికే డ్రెస్ అని ప్రకటించారు. ఈ విషయం తెలియగానే పెద్ద ఎత్తున యువకులు ఆ షాపు వద్దకు పోటెత్తారు. అక్కడితో ఆగలేదు.
షాపులోకి దూసుకెళ్లి సిబ్బందికి చుక్కలు చూపించారు. ఎవరికి దొరికినవి వారు చుట్టబెట్టుకుని బయటకు వచ్చారు. బయట ఉన్నవాళ్లు చూస్తూ ఊరుకుంటారా.. అలా షాపులోంచి బట్టలు తీసుకొని బయటకు వచ్చిన వారి చేతుల్లోంచి అందరూ తలోటీ లాగేసుకున్నారు. అంత కష్టపడి లోపలినుంచి తెచ్చుకున్నవాళ్లు నోరెళ్లబెట్టి చూస్తుండిపోయారు. మరికొంతమంది తోసుకుని మరీ షోరూమ్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. వాళ్లను అదుపుచేయడం వారి తరం కాలేదు. దాంతో పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులుకు కూడా అక్కడి పరిస్థితిని చూసి చేతులెత్తేసారు. చేసేది లేక అతి కష్టం మీద సిబ్బంది దుకాణం మూసివేశారు. దీంతో యువకులు వెనుదిరిగారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ చూడండి