- హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో భారీ పేలుడు
- శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఓ ఇంట్లో పేలుడు
- ఈ ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు మృతి.

హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనను పరిశీలించిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ పేలుడు గ్యాస్ సిలిండర్ పేలడంతో జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. మరోవైపు.. పోలీసులు పేలుడు బెడ్ రూమ్‌లో జరిగిందని చెబుతున్నారు. డీసీపీ మయాంక్ మిశ్రా మాట్లాడుతూ.. “ఇది సిలిండర్ పేలుడు కాదు, పేలుడు బెడ్ రూమ్‌లో జరిగినది. దీని ప్రభావం మొత్తం ఇంటిపై పడింది. నలుగురు అక్కడికక్కడే మరణించారు, ఒకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు” అని చెప్పారు.
Read Also: Sekhar Kammula : ప్రేక్షకులకు కొత్తగా ఏదైనా చూపించాలి అనేది నా ప్రయత్నం..
పేలుడుకు గల కారణాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ఫోరెన్సిక్ బృందాలు, పేలుడు విశ్లేషణ నిపుణులను సంఘటనా స్థలానికి పంపించారు. డీసీపీ మిశ్రా మాట్లాడుతూ.. “గ్యాస్ సిలిండర్ చెక్కుచెదరకుండా ఉంది, అయితే ఎయిర్ కండిషనర్ యూనిట్ బాగా దెబ్బతింది. అయితే ఏసీ వల్ల పేలుడు సంభవించిందా అనే దానిపై పరిశీలిస్తున్నాం.” అని చెప్పారు. మరణించిన వారిలో ఇద్దరు 10 సంవత్సరాల పిల్లలు, ఒక మహిళ, ఒక పురుషుడు ఉన్నారు. పేలుడుకు గల కారణం ఎయిర్ కండిషనర్ కంప్రెసర్‌లో జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు కారణంగా ఇంట్లో మంటలు చెలరేగగా.. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అనంతరం.. ఇంట్లో నుంచి నాలుగు మృతదేహాలను వెలికితీశారు. మరోవైపు.. ఈ ఘటనలో గాయపడిన హరిపాల్ సింగ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు..