- జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా విస్తృతంగా ఉగ్రవేట..
- మరో లష్కరే తోయిబా ఉగ్రవాది ఇళ్లు పేల్చివేత..
- ఇప్పటికే ఆరుగురు ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసం..

Jammu Kashmir: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్‌ని జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదుల కోసం విస్తృతంగా వేట కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా, ఉగ్రవాదులకు సంబంధించి ఇళ్లను భద్రతా బలగాలు ధ్వంసం చేస్తున్నాయి. గత 48 గంటల్లో, భద్రతా బలగాలు, స్థానిక అధికారుల సమన్వయంతో జమ్మూ కాశ్మీర్ అంతటా అనేక మంది ఉగ్రవాదుల ఇళ్లను కూల్చేసి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ చర్యల్ని ముమ్మరం చేశాయి.
తాజా ఆపరేషన్‌లో, ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్‌కి చెందిన కుప్వారాలో ఉన్న ఇంటిని పేల్చేవారు. పహల్గామ్ దాడి తర్వాత ఇది ఆరో సంఘటన. ఇప్పటి వరకు భద్రతా బలగాలు ఆరుగురు ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేశాయి. ఫరూఖ్ ఇంటితో పాటు, ఇతర ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ఆస్తుల్ని కూడా లక్ష్యంగా చేసుకున్నారు.
Read Also: Calcutta High Court: వక్షోజాలను టచ్ చేయడం ‘‘అత్యాచారం కాదు’’, కానీ..
ఇప్పటి వరకు అనంత్‌నాగ్ జిత్లాలోని థోకర్‌పూరాలోని ఆదిల్ అహ్మద్ థోకర్, పుల్వామలోని ముర్రాన్‌కి చెందిన అహ్సాన్ ఉల్ హక్ షేక్, త్రాల్‌లో ఆసిఫ్ అహ్మద్ షేక్, షోఫియాన్‌లోని చోటి పురాకు చెందిన షాహిద్ అహ్మద్ కుట్టాయ్, కుల్గామ్‌లో మతల్హామాకు చెందిన అహ్మద్ గనీ ఇళ్లను కూల్చేశారు. శుక్రవారం, పహల్గామ్ దాడిలో పాల్గొన్నట్లు భావిస్తున్న ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను భద్రతా దళాలు కూల్చివేశాయి. బిజ్‌బెహారాలో లష్కర్ ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ థోకర్ నివాసాన్ని IEDలను ఉపయోగించి పేల్చివేయగా, ట్రాల్‌లోని ఆసిఫ్ షేక్ ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేశారు.
మంగళవారం, పహల్గామ్ బైసరన్ లోయలో అందాలను చూసేందుకు వచ్చిన టూరిస్టుల్ని, ముఖ్యంగా హిందూ మతానికి చెందిన వారిని టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది మరణించారు. ఈ దాడికి ప్లాన్ చేయడంలో పాక్ ఉగ్రవాదులకు ఆదిల్ థోకర్ సాయం చేశాడని అధికారులు అనుమానిస్తున్నారు. 2018లో పంజాబ్‌లోని అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా థోకర్ పాకిస్తాన్‌లోకి ప్రవేశించి, అక్కడ ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ పొందాడు. తరువాత అతను గత సంవత్సరం జమ్మూ కాశ్మీర్‌లోకి తిరిగి చొరబడ్డాడు.