High Headlines @9PM 31.03.2025 – NTV Telugu

Written by RAJU

Published on:

  • దరఖాస్తు గడువు పెంచిన ప్రభుత్వం.. అంతేకాదు..!
  • ఈద్ ప్రార్థనల్లో పాలస్తీనా జెండా.. విచారణ ప్రారంభం..
  • పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంటున్న HCU భూ వివాదం
  • కూటమి ప్రభుత్వంలో ఆ దేవదేవుడికి కూడా నిదుర లేకుండా పోతుంది..!
High Headlines @9PM 31.03.2025 – NTV Telugu

‘రాజీవ్ యువ వికాసం’ పథకంపై మంత్రి కీలక వ్యాఖ్యలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో కలిసి రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. సాంఘిక సంక్షేమ,మైనార్టీల,వెనుకబడిన తరగతుల, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కొరకు రాజీవ్ యువ వికాసం కార్యక్రమని, రాష్ట్రంలో ఉన్న యువతకు స్వయం ఉపాధి కల్పించాలని లక్ష్యంతో రాజీవ్ యువ వికాసం ద్వారా రూ.50 వేల నుండి రూ.4 లక్షల వరకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వంలో ఆ దేవదేవుడికి కూడా నిదుర లేకుండా పోతుంది..!

మరోసారి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా.. ‘ఏడుకొండల స్వామికి కునుకు కరువు!.. రోజుు 23 గంటలకు పైగా కొనసాగుతున్న దర్శనాలు’ అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన రోజా.. కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, తిరుమల శ్రీవారికీ నిద్ర లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. ‘సంప్రదాయాల ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి.. కానీ, రోజుకు దాదాపు 10 వేల VIP బ్రేక్ దర్శనాలకు ప్రాధాన్యమిస్తూ స్వామికి నిద్ర లేకుండా చేస్తున్నారని.. మరోవైపు సాధారణ భక్తుల దర్శనాలను తగ్గించారు.. ఇదేనా పవన్, BJPల సనాతన ధర్మం?.. ఇదేనా చంద్రబాబు నమూనా ప్రక్షాళన?’ అంటూ కూటమి పార్టీలు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. భారతీయ జనతా పార్టీపై ఫైర్‌ అయ్యారు.. కూటమి ప్రభుత్వంలో ఆ దేవదేవుడికి కూడా నిదుర లేకుండా పోతుంది..! కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, చివరికి ఆ దేవదేవుడికి కూడా నిదుర లేకుండా పోతుంది.. భగవంతుడు అన్నీ గమనిస్తున్నాడు!! అంటూ ట్వీట్‌ చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా..


బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా ఢిల్లీలో మహాధర్నా… ఢిల్లీకి మంత్రులు పొన్నం, కొండా సురేఖ

తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ శాసన సభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలని ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘాలు మహాధర్నాకు పిలుపునిచ్చాయి. ఈ మహాధర్నాలో ఏఐసీసీ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఇతర మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, వాకిటి శ్రీహరి, ఈర్లపల్లి శంకరయ్యలు పాల్గొని సంఘీభావం తెలియజేయనున్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కూడా ఇందులో పాల్గొననున్నారు.

తెలంగాణ కేబినెట్ విస్తరణ.. మంత్రి ఉత్తమ్‌ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో కేబినెట్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆశావహుల జాబితాను కాంగ్రెస్ హైకమాండ్‌కు పంపినట్లు సమాచారం. హైకమాండ్ పరిశీలన అనంతరం తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ప్రత్యేకంగా కలుసుకుని మంత్రివర్గ విస్తరణపై అధికారికంగా సమాచారం అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా వచ్చే నెల 3వ తేదీన నలుగురు కొత్త మంత్రులు కేబినెట్‌లో చేరే అవకాశముందని తెలుస్తోంది.

సెలవు రోజుల్లోనూ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు.. భారీ ఆదాయం..

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆది, సోమవారాల్లో సెలవు రోజులైనా కూడా పనిచేశాయి. 2024 -2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 30, 31 చివరి రోజులు కావటంతో ఈ రెండు రోజులు కూడా రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సిబ్బంది ఉగాది పండుగ, రంజాన్ పండుగ రెండు రోజులు కూడా రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లును నిర్వహించారు. శనివారం అమావాస్య కావటంతో ఆదివారం ఉగాది పండుగ రోజు కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక సోమవారం రంజాన్ పండుగ రోజు కూడా స్వల్ప సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి.

పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంటున్న HCU భూ వివాదం

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. ఈ వ్యవహారంపై విశ్వవిద్యాలయం తాజాగా విడుదల చేసిన ప్రకటనలో, తెలంగాణ ప్రభుత్వ సంస్థ అయిన TGIIC (Telangana State Industrial Infrastructure Corporation) ఇచ్చిన ప్రకటనను ఖండించింది. HCU తెలిపిన ప్రకారం, 400 ఎకరాల భూమిని గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి సర్వే నిర్వహించలేదని వెల్లడించింది. జూలై 2024లో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సర్వే జరిగిందన్న వార్తలను HCU ఖండించింది. విశ్వవిద్యాలయం ప్రకటనలో, ఇప్పటివరకు భూమి స్థలాకృతిపై ప్రాథమిక తనిఖీ మాత్రమే జరిగిందని స్పష్టం చేసింది.

HCU భూములు అమ్మడానికి ప్రభుత్వం ఎందుకు ఆరాట పడుతుంది

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం రాజకీయ మలుపు తీసుకుంటోంది. ఈ అంశంపై విద్యార్థుల ఆందోళనలతో పాటు రాజకీయ నాయకుల ప్రస్తావనలు పెరుగుతున్నాయి. తాజాగా, తెలంగాణ భవన్‌లో HCU విద్యార్థులతో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విద్యార్థులు తమ ఆందోళనలను వ్యక్తం చేయగా, కేటీఆర్ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “HCU భూములు అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత ఆరాటపడుతుంది?” అని ప్రశ్నించారు. ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, “సెంట్రల్ యూనివర్సిటీ వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. కానీ, ఇప్పుడు ప్రభుత్వం వేలం వేయాలని చూస్తోంది” అని పేర్కొన్నారు. 2003లో అప్పటి ప్రభుత్వం IMG అనే సంస్థకు ల్యాండ్ కేటాయించిందని కేటీఆర్ గుర్తు చేశారు.

బండి సంజయ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫైర్

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీజేపీ(BJP)పై, కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఘాటు విమర్శలు చేశారు. బండి సంజయ్ ని కేంద్ర మంత్రిగా ఎందుకు చేశారో వారికే తెలియాలని, ఆయనను త్వరగా ఎవరికైనా చూపిస్తే అందరికీ మంచిదని అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు దేశభక్తులు, దేశ ద్రోహులు ఎవరో కూడా తెలియదని విమర్శించారు. ఇలాంటి వారిని ఎంపీలుగా చేసి కేంద్ర ప్రభుత్వం ఎవరిని ఉద్ధరించాలనుకుంటుందో అర్థం కావడం లేదన్నారు. బీజేపీ అధ్యక్ష పదవి కోసమే పోటీ పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆ పదవి ఎవరికో ఒకరికి ఇస్తే వీళ్ళ నోర్లు మూతపడతాయని ఆశిస్తున్నానని అన్నారు.

దరఖాస్తు గడువు పెంచిన ప్రభుత్వం.. అంతేకాదు..!

రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. అభ్యర్థులు ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియపై సమీక్షించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు మార్గదర్శకాలను వెల్లడించారు. రేషన్ కార్డు ఉన్న వారికి ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదని తెలిపారు. దరఖాస్తుదారులకు తక్కువ కాగితపు పని ఉండేలా ఈ వెసులుబాటును కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఈద్ ప్రార్థనల్లో పాలస్తీనా జెండా.. విచారణ ప్రారంభం..

ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ఎలాంటి సమస్యలు లేకుండా రంజాన్ ముగిసింది. ఈద్ రోజు పలు ప్రాంతాల్లో యూపీ పోలీసులు భద్రతను పెంచారు. దీంతో పాటు రూడ్లపై నమాజ్ చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు. చిన్న చిన్న ఘర్షణలు మినహా యూపీలో ప్రశాంతంగా పండగ ముగిసింది. ఇదిలా ఉంటే, సహరాన్‌పూర్‌లో ఈద్ ప్రార్థనలు చేసిన తర్వాత ఒక గుంపు పాలస్తీనా జెండా ఊపుతూ నినాదలు చేయడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంతో పోలీసుల దృష్టిలో పడింది. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందిన ఎస్పీ వ్యోమ్ బిందాల్ తెలిపారు. కొంతమంది యువకులు వేరే దేశ జెండాను ఊపుతూ కనిపించిన వీడియో సోషల్ మీడియా ద్వారా మాకు తెలిసింది. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని, తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంబాలా రోడ్డులోని ఈద్గాలో నమాజ్ చేసిన తర్వాత కొంత మంది యువకులు పాలస్తీనా జెండాతో నినాదాలు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించే ప్రయత్నం జరుగుతోంది.

 

Subscribe for notification
Verified by MonsterInsights