High Headlines @9PM 24.04.2025 – NTV Telugu

Written by RAJU

Published on:

  • ఉగ్రదాడి నేపథ్యంలో ముస్లింలకు ఓవైసీ కీలక పిలుపు..
  • ‘‘ఏ చర్యకైనా ఫుల్ సపోర్ట్ ఉంటుంది’’.. కేంద్రానికి రాహుల్ గాంధీ మద్దతు..!
  • భారత్ సమ్మిట్ అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం..
  • ఏదో పెద్దగా జరగబోతోంది.. ‘‘రెడ్ ఫైల్‌’’తో రాష్ట్రపతిని కలిసిన అమిత్ షా..
High Headlines @9PM 24.04.2025 – NTV Telugu

బాలుడి కిడ్నాప్.. గంటలో చేధించిన పోలీసులు

పాతబస్తీ చంద్రాయణగుట్ట ప్రాంతంలో ఓ చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. అయితే, ఈ సంఘటనలో పోలీసులు వేగంగా స్పందించడంతో గంటలోనే బాలుడిని రక్షించి, కిడ్నాపర్లను పట్టుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఒక బాలుడిని అతని బాబాయి సాదిక్ దగ్గరకు తీసుకెళ్లారు. సాదిక్ బాలుడిని ఓ వైన్ షాప్ కు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవించిన సాదిక్ స్పృహ కోల్పోయి రోడ్డు పక్కనే పడిపోయాడు. ఈ సమయంలో బాలుడు ఒంటరిగా ఉన్నదాన్ని గమనించిన ఒక కిడ్నాప్ ముఠా పిల్లాడిని ఎత్తుకెళ్లింది. బాలుడు కనిపించకపోవడంతో వెంటనే ఆ బాలుడి బాబాయి, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి సీసీకెమెరా ఫుటేజ్ ద్వారా విచారణ ప్రారంభించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు త్వరిత చర్యలు తీసుకుని గంటలోనే బాలుడిని కిడ్నాప్ చేసిన ముఠాను పట్టుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు చూపిన స్పందనకు ప్రజల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారుల భద్రతపై పెద్దల బాధ్యత ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరొకసారి గుర్తు చేసింది.

చౌకబారు రాజకీయాలు మానుకోవాలి.. బీజేపీ ఎంపీ హాట్ కామెంట్స్

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా జరిగిన ఉగ్రదాడిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ భద్రతా వ్యవస్థ వైఫల్యాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తూ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతుందన్నారాయన. కాంగ్రెస్ నేతలు CWC సమావేశంలో దాడి ఘటనను పొలిటికల్ ఈవెంట్‌లా మార్చే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. భద్రతా సమస్యపై అసత్య ప్రచారాలు చేసి ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు కాంగ్రెస్ పూనుకుంటోందని విమర్శించారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ పట్ల ఉన్న ప్రేమ కొత్తది కాదని, ఇప్పటికే మన రాష్ట్రానికి చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్‌ను ప్రేమిస్తున్నారని అన్నారు. అలాంటి నేతలకు భారత భద్రతపై మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు.

రాష్ట్రంలో దుర్మార్గమైన రెడ్‌బుక్‌ పాలన జరుగుతోంది

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాల సమయంలో పార్టీకి నిలబడి ధైర్యంగా పోరాడిన ప్రజాప్రతినిధులందరికీ సెల్యూట్ చేస్తున్నానని జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయని, ప్రజలు అత్యంత కష్టాల్లో ఉన్నారని ఆయన ఆరోపించారు. “ఇది దుర్మార్గమైన రెడ్‌బుక్ పాలన. ప్రజావ్యతిరేకతను ఎంత అణిచివేయాలనుకున్నా సాధ్యం కాదు” అని జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు పాలనలో అవినీతి విరుచుకుపడిందని, ప్రజలపై భారం పెడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని దెబ్బతీశారని జగన్ విమర్శించారు. రాష్ట్రంలోని పాఠశాలలు, ఆసుపత్రులు నరకంగా మారాయని, బెల్టు షాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయంటూ ప్రజల జీవితాలు అస్తవ్యస్తమైపోయినట్లు వివరించారు.

పహల్గామ్ ఉగ్రదాడిపై ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం వివాదస్పద వ్యాఖ్యలు.. అరెస్ట్..

జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకుల చనిపోయి, యావత్ భారతదేశం దు:ఖంతో ఉంటే, మరికొందరు మాత్రం ఈ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, అస్సాంకు చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో AIUDF ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు.

యూట్యూబర్ శ్యామ్ అరెస్ట్.. రూ. 5 కోట్ల ఎక్స్‌టార్షన్‌ కేసు

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ప్రముఖ యూట్యూబర్ శ్యామ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక వ్యాపారవేత్త వద్ద రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్యామ్‌పై ఎక్స్‌టార్షన్‌ కేసు నమోదు చేశారు. అనంతరం శ్యామ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వివరాల ప్రకారం, శ్యామ్ సదరు వ్యాపారవేత్తను బెదిరించి రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం శ్యామ్‌ను అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసులు ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

నాయీ బ్రాహ్మణుల భృతిని రూ. 25 వేలకు పెంచుతూ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాలయాల్లో సేవలందించే నాయీ బ్రాహ్మణుల అభ్యున్నతికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర దేవాదాయశాఖ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, నాయీ బ్రాహ్మణులకు నెలలవారీగా అందే భృతిని రూ. 25,000కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వారికి లభిస్తున్న రూ.20,000 కమిషన్‌ను రూ.25,000కు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ జీవో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44 దేవాలయాలకు వర్తించనుంది. ఇందులో ప్రతి దేవాలయంలో ఏడాదిలో కనీసం 100 రోజుల పాటు సేవలందించే నాయీ బ్రాహ్మణులకు ఈ పెంపు వర్తించనుంది. ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణులకు కనీస మొత్తంగా నెలకు రూ.25 వేలు అందేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో నాయీ బ్రాహ్మణుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని, వారికి ఇచ్చే కమిషన్‌ను పెంచాలని ఆయన సూచించారు. సీఎం సూచన మేరకు దేవాదాయశాఖ తక్షణమే స్పందించి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయం ద్వారా దేవాలయాల్లో నిరంతరంగా సేవలందించే నాయీ బ్రాహ్మణులకు ఆర్థికంగా ఎంతో ఉపశమనం లభించనుంది లభించనుంది.

ఏదో పెద్దగా జరగబోతోంది.. ‘‘రెడ్ ఫైల్‌’’తో రాష్ట్రపతిని కలిసిన అమిత్ షా..

జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది మరణించారు. ఈ దాడిపై యావత్ దేశం తన ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్‌కి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఈ ఉగ్రవాద దాడి గురించి గురువారం వీరిద్దరు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతికి వివరించారు. ఈ దాడికి పాల్పడింది మేమే అని లష్కరే తోయిబా అనుబంధం ఉగ్రసంస్థ ప్రకటించుకుంది. పాకిస్తాన్ ప్రమేయం ఈ దాడిలో స్పష్టంగా కనిపిస్తోంది. పాక్ జోక్యానికి తగిన ఆధారాలను ఇప్పటికే మన ఇంటెలిజెన్స్ సంస్థలు సేకరించాయి. మరోవైపు, భారత ప్రభుత్వం విదేశీ దౌత్యవేత్తలకు దాడి గురించి వివరాలను అందించింది. పాకిస్తాన్ ప్రమేయం గురించిన ఆధారాలను కూడా వారి ముందుంచింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు జర్మనీ, జపాన్, పోలాండ్, యుకె, రష్యా సహా 20 కి పైగా దేశాల రాయబారులకు వివరించారు.

భారత్ సమ్మిట్ అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం..

తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తదుపరి నిర్వహించనున్న భారత సమ్మిట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమ్మిట్‌లో శాంతి, అహింస, ఆర్థికం, సమానత్వం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయని వివరించారు. ఈ అంశాలు కాంగ్రెస్ పార్టీ యొక్క మూలవిధానాలకు అనుగుణంగా ఉంటాయని ఆయన తెలిపారు. భారత్ సమ్మిట్‌ని కాంగ్రెస్ పార్టీ యొక్క మూలవిధానాలను ప్రతిబింబిస్తూ నిర్వహిస్తున్నామని, ఇందులో వివిధ దేశాలకు చెందిన నాయకులు, మేధావులు, వ్యాపారవేత్తలు పాల్గొంటున్నారని భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ రాష్ట్రం గ్లోబల్ స్థాయిలో కీలకమైన అంశాలను చర్చించే బాధ్యతను తీసుకుంటుందని చెప్పారు. 100 దేశాలకు చెందిన 450 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొంటారని, ఇది తెలంగాణకు గర్వకారణంగా ఉంటుందన్నారు భట్టి. ఈ సమ్మిట్ నిర్వహించడం తెలంగాణకు గొప్ప అదృష్టమని భట్టి విక్రమార్క అన్నారు.

‘‘ఏ చర్యకైనా ఫుల్ సపోర్ట్ ఉంటుంది’’.. కేంద్రానికి రాహుల్ గాంధీ మద్దతు..!

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో అమాయక పౌరులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటన నేపథ్యంలో దేశ రాజకీయ వర్గాలన్నీ భద్రతా అంశంపై ఒక్కటై చర్చలకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన నేడు (గురువారం) న్యూ ఢిల్లీలో ఒక అత్యంత కీలకమైన అఖిలపక్ష సమావేశం జరిగింది. దేశ భద్రతకు సంబంధించి ఈ సున్నితమైన అంశంపై చర్చించేందుకు వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తదితరులు పాల్గొన్నారు.

ఉగ్రదాడి నేపథ్యంలో ముస్లింలకు ఓవైసీ కీలక పిలుపు..

జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దేశ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నామనే సందేశాన్ని పంపడానికి శుక్రవారం ప్రార్థనలకు వెళ్లేటప్పుడు ముస్లింలు తమ్ చేతులకు నల్ల బ్యాండ్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్స్ పోస్టులో ‘‘ మీ అందరికీ తెలిసినట్లుగా, పాకిస్తాన్‌కు చెందిన లష్కరే-ఎ-తోయిబా ఉగ్రవాదులు పహల్గామ్‌లో 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొన్నారు. ఈ ఉగ్రవాద చర్యను ఖండిస్తూ, మీరు రేపు ప్రార్థనలకు వెళ్ళినప్పుడు, దయచేసి మీ చేతికి నల్లటి బ్యాండ్ ధరించండి’’ అని వీడియో సందేశాన్ని పంచుకున్నారు.

 

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights