నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో అర్ధగంట పాటు వర్షం దంచికొట్టింది కుంభ వర్షం కురిసింది. శ్రీశైలం, సున్నిపెంటలలో ఎడ తెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి క్షేత్రంలో అలానే సుండిపెంటలో ప్రధాన విధులన్ని జలమయమయ్యాయి. ఉదయం నుంచి ఉక్కపోతగా ఉన్నా.. మద్యాహ్నానికి ఒక్కసారిగా మబ్బులతో భారీ వర్షం మొదలైంది. వర్షం కారణంగా శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలం క్షేత్రానికి వచ్చిన భక్తులు వసతి గృహాలకు పరిమితమయ్యారు. ఎండ ఉక్కపోతకు గురైన స్థానికులు భక్తులు భారీ వర్షం పడటంతో కొద్దిపాటి ఉపశమనం పొందారు. ఉరుములు మెరుపులు ఈదురుగాలితో వర్షం మొదలవడంతో ముందస్తుగా విద్యుత్ అధికారులు శ్రీశైలం మండలంలో విద్యుత్తిని నిలిపివేశారు. మరోవైపు ఈ రోజు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆది దంపతులు స్వర్ణ రధంపై ఊరేగారు.
వైభవంగా స్వర్ణ రథోత్సవం
శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లోకాకళ్యాణార్ధం శ్రీస్వామి అమ్మవారికి దేవస్థానం ఏసీ చంద్రశేఖర్ రెడ్డి స్వర్ణరథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వేకువజామునే శ్రీమల్లికార్జునస్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణరథోత్సవంలో ఆశీనులైన శ్రీ స్వామి అమ్మవారికి అర్చకస్వాములు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. స్వర్ణరథాన్ని ఆలయ ఎదురుగల గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు మళ్ళీ నంది మండపం నుంచి గంగాధర మండపం వరకు భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు ,గిరిజనుల నృత్యాలు మేళతాళాలతో వైభవంగా జరిగింది.
ఇవి కూడా చదవండి
స్వర్ణరథోత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వందలాదిగా స్థానికులు, భక్తులు తరలివచ్చి స్వర్ణరథోత్సవం తిలకించారు. స్వర్ణరథంలో ఆసీనులైన శ్రీస్వామి అమ్మవారు ఆలయ ప్రధాన వీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అయితే ప్రతీ మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజు ఈ స్వర్ణరథోత్సవాన్ని నిర్వహిస్తామని ఏసీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..