-
రాష్ట్రంలో పలు జిల్లాలపై అకాల వర్షం ప్రభావం
-
నేల రాలిన మామిడి, దెబ్బతిన్న వరి, మొక్కజొన్న
-
మహబూబ్‌నగర్ జిల్లాలో 1,980 ఎకరాల్లో పంట నష్టం
-
రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లోనూ తీవ్రంగా దెబ్బతిన్న పంటలు
మహబూబ్‌నగర్, పాలమూరు, వికారాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షం ఎప్పట్లానే రైతులకు కడగండ్లు మిగిల్చింది. రైతన్నల చెమటతో నెలల తరబడి తడిచిన పొలంలో కురిసిన వడగళ్లు కన్నీటిధారలను మిగిల్చాయి. శనివారం రాత్రి భారీగా కురిసిన వడగండ్ల వానకు రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో పెద్ద ఎత్తున పంటనష్టం వాటిల్లింది. వందల ఎకరాల మామిడి తోటల్లో కాయలు నేలరాలగా.. వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. పలుచోట్ల వరి పైరు దెబ్బతిని ధాన్యం నేల రాలి బురదలో కలిసిపోయింది. మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం రాత్రి ఈదురుగాలులు, వడగళ్ల వానకు 1,980 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి బి.వెంకటేశ్ తెలిపారు. హన్వాడ మండలంలోని 2 గ్రామాలు, మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని 5 గ్రామాలు, మూసాపేట మండలంలోని 6 గ్రామాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. మొత్తం 13 గ్రామాల్లో 1,492 మంది రైతులకు సంబంధించిన 1,980 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు గుర్తించామన్నారు.
అందులోనే ఐదుగురికి చెందిన 13 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నట్లు తెలిపారు. సోమవారం నుంచి క్షేత్ర స్థాయిలో పంట నష్టాన్ని పరిశీలిస్తామని తెలిపారు. 33 శాతం కంటే అధికంగా నష్టం జరిగినట్లు నిర్ధారణ అయితే ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. ఒక్క మహబూబ్‌నగర్ మండలంలోని ఆరు గ్రామాల్లోనే 1,525 ఎకరాల్లో పంట నష్ఠం జరిగిందని రైతులు చెబుతున్నారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లా బొక్కలోనిపల్లిలో పర్యటించిన మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఇక, శనివారం రాత్రి కురిసిన వడగండ్ల వాన దెబ్బకు వనపర్తి జిల్లా, కొత్తకోట మండలంలోని పలు గ్రామాల్లో వరిపైర్లు దెబ్బతిన్నాయి. మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. ఖిల్లాఘనపురం శివారులో మొక్కజొన్న పంట పూర్తిగా ఒరిగిపోయింది. మరోపక్క, వికారాబాద్ జిల్లాలో మూడు రోజులుగా వడగళ్ల వానలు పడుతున్నాయి. దీంతో జిల్లాలోని మర్పల్లి, నవాబ్‌పేట్, మోమిన్‌పేట్, కోట్‌పల్లి, పూడూరు తదితర మండలాల్లో 500 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది.
చల్లబడిన రాజధాని
హైదరాబాద్ సిటీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రైతులతో ఓ పక్క కన్నీరు పెట్టిస్తున్న అకాల వర్షాలు మరోపక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రజలకు మాత్రం ఎండల నుంచి ఉపశమనం ఇచ్చాయి. శుక్రవారం రాత్రి దంచికొట్టిన వానతో వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ ఒక్కసారిగా చల్లబడింది. మూడు రోజుల క్రితం 40 డిగ్రీల దాకా నమోదైన ఉష్ణోగ్రతలు శని, ఆదివారాల్లో పడిపోయాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా బాగా తగ్గాయి. హైదరాబాద్ జిల్లాలో ఆదివారం గరిష్ఠంగా 34.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.