HCA Funds Misuse: ED Investigation Reveals Major Irregularities in Cricket Association

Written by RAJU

Published on:

  • HCA నిధుల అక్రమాలపై ఈడీ విచారణ
  • HCAకు చెందిన రూ.51 లక్షల ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ
  • అనుమతులు లేకుండా పెద్ద మొత్తంలో పరికరాలు కొన్నట్లు గుర్తింపు
  • HCA నిధులతో ప్రైవేట్‌ ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తింపు
  • HCA సెక్రటరీ, ట్రెజరర్‌లు క్విడ్‌ప్రోకోకు పాల్పడినట్లు ఈడీ గుర్తింపు
HCA Funds Misuse: ED Investigation Reveals Major Irregularities in Cricket Association

HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) నిధుల దుర్వినియోగంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. హెచ్‌సీఏ నిధుల అక్రమ లావాదేవీలకు సంబంధించి ఈడీ తాజాగా కొన్ని కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. హెచ్‌సీఏలో కాంట్రాక్టుల పేరుతో క్విడ్ ప్రో కో (Quid pro quo) వ్యవహారం చోటుచేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రత్యేకంగా హెచ్‌సీఏ మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్‌పై ఈడీ అభియోగాలు నమోదు చేసింది.

సురేందర్ అగర్వాల్ తన హోదాను ఉపయోగించి హెచ్‌సీఏ నిధులను అనుమతి లేకుండా వినియోగించారని అధికారులు వెల్లడించారు. క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, జిమ్ ఎక్విప్మెంట్ కొనుగోలు పేరుతో భారీ మొత్తంలో సబ్ కాంట్రాక్టులు ఇచ్చారని, అందులో పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలింది. సురేందర్ అగర్వాల్‌కు సంబంధించి 90 లక్షలకు పైగా నగదు మూడింటికిపైగా కంపెనీల ద్వారా చెల్లింపులు జరిగినట్లు ఈడీ గుర్తించింది.

ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ప్రధాన అంశాల్లో అతని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు కూడా పెద్ద మొత్తంలో నగదు బదిలీ జరిగినట్లు తెలిసింది. సురేందర్ అగర్వాల్ భార్య, కొడుకు, కోడలు బ్యాంకు ఖాతాల్లోకి లక్షల రూపాయలు జమ అయినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు, అతని భార్యకు చెందిన కేబీ జ్యువెలర్స్ ఖాతాకు కూడా భారీగా నగదు బదిలీ జరిగింది.

అక్రమ లావాదేవీలు, నిధుల దుర్వినియోగం, క్విడ్ ప్రో కో వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకుని, సురేందర్ అగర్వాల్ అక్రమ లావాదేవీలకు సంబంధించి 51.29 లక్షల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీలు, క్రికెట్ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. నిధుల దుర్వినియోగం వెనుక మరికొందరు ఉన్నారా? ఈ వ్యవహారం అంతర్గతంగా ఇంకా ఎంత విస్తరించింది? అనే ప్రశ్నలకు సమాధానాలు త్వరలో వెల్లడికావచ్చని అధికారులు చెబుతున్నారు.

ఈ కేసు మరింత ముదిరే అవకాశం ఉండటంతో, హెచ్‌సీఏ వ్యవహారం క్రికెట్ ప్రేమికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు స్టేడియంల అభివృద్ధికి కేటాయించిన నిధులను ఆటగాళ్ల భవిష్యత్తు కోసం ఉపయోగించాల్సిన బాధ్యత ఉన్న హోదాలో ఉన్నవారు, వాటిని అక్రమంగా మళ్లించడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తే, సంబంధిత వ్యక్తులపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

KTR : కేటీఆర్‌పై నమోదైన కేసు కొట్టివేత

Subscribe for notification