- సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు చెంపపెట్టు
- పర్యావరణ విధ్వంసంపై సీఈసీ నివేదిక కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను వెలికి తీసింది
- ప్రజలంతా ఒక్కటై రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనను ఎదుర్కొవాలి : హరీష్ రావు

Harish Rao : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణాన్ని ఎలా అణిచివేస్తుందో, అది ఎంత భయానకంగా, బాధ్యతారాహిత్యంగా సాగుతోందో ఇప్పుడు దేశానికి, ప్రపంచానికి తేటతెల్లమైందని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. కంచ గచ్చిబౌలి భూముల అంశంలో సుప్రీం కోర్టులో జరిగిన వాదనలు, ప్రభుత్వ నైపుణ్యానికి బదులుగా నిరంకుశత్వాన్ని ఉద్ఘాటించాయని ఆయన అన్నారు.
సెలవు దినాల్లోనూ ప్రభుత్వ యంత్రాంగం బుల్‌డోజర్లతో భూవిధ్వంసానికి పాల్పడడంపై సుప్రీంకోర్టు చేసిన గంభీర వ్యాఖ్యలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాంటి విషయమని హరీష్ రావు వ్యాఖ్యానించారు. “బాధ్యత గల ప్రభుత్వం ఎలా ఉండాలో మరిచిపోయిన ఈ ప్రభుత్వానికి ఇది గుణపాఠంగా నిలుస్తుంది” అని ఆయన అన్నారు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (CEC) రూపొందించిన నివేదిక, ఈ భూములపై జరిగిన విధ్వంసానికి శాస్వత సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. వంద ఎకరాల అడవిని ధ్వంసం చేసిన ప్రభుత్వంపై, ఈ ప్రాంతాన్ని ఎలా పునరుద్ధరిస్తారో అడిగిన సుప్రీంకోర్టు ప్రశ్న ఆహ్వానించదగ్గ పరిణామం అని పేర్కొన్నారు.
“అధికారం ఉంది కదా అని ఎవరైనా తాము కోరినట్టు వ్యవహరిస్తే, న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోదు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కాపాడటానికి న్యాయవ్యవస్థ ఎప్పుడూ ముందుంటుంది. గతంలోనూ అనేకసార్లు ఇది నిరూపితమైంది. ఇప్పుడు మళ్లీ అదే తేలింది” అని హరీష్ రావు చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పర్యావరణ హత్యలకే ఉదాహరణగా మారిందని హరీష్ రావు మండిపడ్డారు. “నాడు హైడ్రా పేరుతో ఇళ్లను కూల్చి అరాచకం సృష్టించిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు బుల్‌డోజర్లతో అడవులను నాశనం చేయడంలో నిమగ్నమైందని విమర్శించారు. ప్రజల జీవనాన్ని పట్టించుకోకుండా పాలన సాగించే ఈ విధానం నిరంకుశ పాలనకు నిదర్శనం” అన్నారు.
“మేము న్యాయ వ్యవస్థపై అపారమైన గౌరవం కలిగి ఉన్నాం. అందుకే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి నివేదిక ఇచ్చాం. అందులో ఆధారాలతో సహా పర్యావరణ విధ్వంసం వివరించాం” అని తెలిపారు. “వృక్షో రక్షతి రక్షిత – అని పెద్దలమాట. కానీ ఈ ప్రభుత్వం మాత్రం వృక్షో భక్షతి అన్నట్టుగా వ్యవహరిస్తోంది. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలంతా ఒకటిగా ముందుకు రావాలి,” అని పిలుపునిచ్చారు హరీష్ రావు.
Kancha Gachibowli: కంచ గచ్చిబౌలి భూములపై సీఈసీ కీలక నివేదిక.. పర్యావరణ పరిరక్షణకు మద్దతు