Harish Rao: త్వరలో గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌

Written by RAJU

Published on:

‘పోలవరం’ ఇంకో ఐదేళ్లయినా పూర్తి కాదు

ఆ ప్రాజెక్టు తర్వాత మొదలు పెట్టిన కాళేశ్వరం

ఫలితాలు ఇప్పటికే ప్రజలకు అందుతున్నాయి

దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రం తెలంగాణ

రానున్న రోజుల్లో జిల్లాకో మెడికల్‌ కాలేజీ

రాష్ట్రంలో సాధారణ ప్రసవాలు పెరగాలి

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు

సిద్దిపేట క్రైం/ సిద్దిపేట టౌన్‌/ చిన్నకోడూరు/సుభా‌ష్‌నగర్‌ (కరీంనగర్‌), నవంబరు 13: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీ(Group-4 posts Recruitment)కి నోటిఫికేషన్‌ విడుదల చేస్తుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) చెప్పారు. ఆదివారం ఉదయం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ‘కానిస్టేబుల్‌, ఎస్‌ఐ అభ్యర్థులకు ఉచిత శారీరక దృఢత్వ ఉచిత శిక్షణా కేంద్రం’లో పాలు, గుడ్లను పంపిణీ చేసి మాట్లాడారు. పట్టుదలతో ఉద్యోగం సాధిస్తే ఒక ప్రజాప్రతినిధిగా అదే తమకు నిజమైన ఆనందమని అభ్యర్థుల్లో స్ఫూర్తిని నింపారు. ఉచిత శిక్షణ తరగతులను అభ్యర్థులంతా ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం చిన్నకోడూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి హాజరయ్యారు. చంద్లాపూర్‌ గ్రామంలోని లక్ష్మీ రంగనాయకస్వామి ఫంక్షన్‌ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందే ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదని, ఇంకా ఐదేళ్లయినా పూర్తి కాదని అన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసి ఆ ఫలాలను ప్రజలకు అందించామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు రాష్ట్రంలో సాగయ్యే భూమి కోటి 30 లక్షల ఎకరాలు ఉండేదని, రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక 2.30 కోట్ల ఎకరాలకు పెరిగిందని హరీశ్‌రావు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాలు పెరిగాయని, భూమికి బరువు అయ్యేంత పంట పండుతోందని పేర్కొన్నారు. దేశానికే అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందన్నారు. ఇదిలా ఉండగా, సిద్దిపేట పట్టణానికి చెందిన బాలుడు తరుణ్‌ తాను దాచుకున్న డబ్బును బీఆర్‌ఎస్‌ పార్టీకి విరాళంగా ఇచ్చాడు. ఆదివారం లింగారెడ్డిపల్లి పెద్దమ్మ ఆలయంలో తరుణ్‌ రూ.2 వేలు ఉన్న తన కిడ్డీ బ్యాంక్‌ను హరీశ్‌కు అందజేశాడు. కిడ్డీ బ్యాంక్‌ను సీఎం కేసీఆర్‌కు అందిస్తానని హరీశ్‌ చెప్పారు.

ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా బీఎన్‌ రావు

వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హరీ్‌షరావు అన్నారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) 6వ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ బీఎన్‌ రావు ఈ సందర్భంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో హరీ్‌షరావు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం ఐదు మెడికల్‌ కాలేజీలు ఉండేవని, ప్రస్తుతం వాటి సంఖ్య 17కు పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో జిల్లాకొక మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. ప్రైవేట్‌ వైద్యులు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో సేవలందించాలని, అవసరమైతే వయస్సు సడలింపు ఇస్తామని హరీ్‌షరావు తెలిపారు. తెలంగాణలో.. ముఖ్యంగా కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్నాయని, డబ్ల్యూహెచ్‌వో కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేసిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. రాష్ట్రంలో సాధారణ ప్రసవాలను పెంచాలన్నారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్‌రావు మాట్లాడుతూ ఐఎంఏ పక్షాన రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

Updated Date – 2022-11-14T13:54:40+05:30 IST

Subscribe for notification
Verified by MonsterInsights