భోపాల్, మార్చి 17: మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్వాలియర్‌లోని గజ్రా రాజా మెడికల్ కాలేజీలో భాగమైన కమలా రాజా హాస్పిటల్‌లోని గైనకాలజీ, ప్రసూతి విభాగంలో ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ చికిత్స పొందుతున్న దాదాపు 190 మంది రోగులను సురక్షితంగా తరలించారు. లేబర్ రూమ్‌లోని ఎయిర్ కండిషనర్ యూనిట్‌లో పేలుడు కారణంగా ఈ మంటలు చెలరేగాయి. దీంతో ఆస్పత్రిలోని రోగులందరినీ వైద్య కళాశాల ప్రాంగణంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.
మంటల ధాటికి లేబర్ రూమ్ పక్కనే ఉన్న ఐసియు, ప్రసూతి వార్డు పొగతో నిండిపోయాయి. రోగులను రక్షించడానికి ఆసుపత్రి సిబ్బంది.. ఆస్పత్రి కిటికీలను పగలగొట్టి బయటికి తరలించారు. దాదాపు ఉదయం 4 గంటల వరకు సహాయక చర్యలు కొనసాగాయి. సంఘటన జరిగిన సమయంలో 16 మంది మహిళలు లేబర్ రూమ్‌లో చికిత్స పొందుతుండగా.. దాదాపు 50 మంది మహిళలు ప్రసూతి వార్డులో ఉన్నారు. మరో 13 మంది ఐసీయూలో ఉన్నారు. ప్రమాదం జరిగిన వార్డుకి సమీపంలోని పీడియాట్రిక్ వార్డులో కూడా కొంతమంది పిల్లలు ఉన్నారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
జిల్లా కలెక్టర్ రుచికా చౌహాన్ మాట్లాడుతూ.. ఈ సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించామన్నారు. కమలా రాజా హాస్పిటల్ గైనకాలజీ విభాగంలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లోని ఎయిర్ కండిషనర్ పేలడంతో మంటలు చెలరేగాయని గ్వాలియర్ కలెక్టర్ రుచికా చౌహాన్ తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత ఆసుపత్రి ప్రాంగణం పొగతో నిండిపోయిందని, అక్కడి సిబ్బంది వెంటనే రోగులందరినీ సమీపంలోని తరలించారని తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.