- బంజారా హిల్స్ రోడ్డుపై తుపాకీతో యువకుల హల్‌చల్
- ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ – పోలీసుల దృష్టికి
- అఫ్సర్ అరెస్ట్ – జీపు సీజ్, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు

Hulchul With Gun : హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్డుపై ఓపెన్ టాప్ జీప్‌లో ప్రయాణిస్తూ తుపాకీ ప్రదర్శన చేసి హంగామా సృష్టించిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నగరవ్యాప్తంగా కలకలం రేపింది. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఓ గుంపు యువకులు ఓపెన్ టాప్ జీప్‌లో వేగంగా ప్రయాణిస్తూ గట్టిగా కేకలు వేయడం, రోడ్డు మీద వెళ్లే ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఆకతాయితనాన్ని ప్రదర్శించారు. అంతేకాకుండా, జీప్ డాష్ బోర్డు మీద తుపాకీ ఉంచి హల్‌చల్ చేయడంతో పాటు, అందులోని ఒక యువకుడు తన చేతిలో తుపాకీ పట్టుకుని గాల్లోకి చూపిస్తూ సంచలనం సృష్టించాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను యువకులే స్వయంగా చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోను గమనించిన బంజారా హిల్స్ పోలీసులు, సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఆకతాయిలపై ఐపీసీ సెక్షన్లతో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన అఫ్సర్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తుపాకీతో వీరంగం సృష్టించిన జీపును సీజ్ చేశారు. పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టి, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వ్యక్తులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నగరంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
CSK vs RCB: టాస్ కీలకం.. మొదట బ్యాటింగ్ చేస్తే రిజల్ట్ ఇదే..!