Gujarat Titans vs Mumbai Indians: ఐపీఎల్ 2025లో తమ తొలి మ్యాచ్‌ల్లో ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు విజయం కోసం ఎదురుచూస్తున్నాయి. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో, రెండు మాజీ ఛాంపియన్ జట్ల మధ్య ఉత్కంఠ పోటీ కనిపించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేసింది. చెత్త ప్రారంభం తర్వాత, చివరి ఓవర్లలో ముంబై జట్టు బలమైన పునరాగమనం చేసింది. వరుసగా మూడు బంతుల్లో 3 వికెట్లు పడగొట్టింది. కానీ, ఏ బౌలర్ కూడా హ్యాట్రిక్ సాధించలేదు. ఇలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
మార్చి 29వ తేదీ శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో, ఆతిథ్య గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేసింది. తమ సొంత మైదానం నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ బలమైన ఆరంభాన్ని సాధించింది. కెప్టెన్ శుభమాన్ గిల్, సాయి సుదర్శన్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ ఔట్ అయిన తర్వాత, జోస్ బట్లర్ కూడా దూకుడుగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. 18వ ఓవర్ సమయానికి గుజరాత్ 179 పరుగులు చేసింది. కేవలం 4 వికెట్లు మాత్రమే పడిపోయాయి. గుజరాత్ జట్టు 200 పరుగుల దిశగా దూసుకుపోతున్నట్లు కనిపించింది. కానీ, అకస్మాత్తుగా వికెట్ల పతనం మొదలైంది.
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు..
ముంబై ఇండియన్స్ వరుసగా 3 బంతుల్లో ముగ్గురు గుజరాత్ బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపింది. కానీ ఏ బౌలర్ ఖాతాలో హ్యాట్రిక్ పడలేదు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏమిటంటే ఈ 3 వికెట్లు రెండు వేర్వేరు ఓవర్లలో పడ్డాయి. రెండవది, వీటిలో ఒకటి రనౌట్ కూడా ఉందన్నమాట. 18వ ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ వేసిన చివరి బంతికి సాయి సుదర్శన్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 19వ ఓవర్ తొలి బంతికే కొత్త బ్యాట్స్‌మన్ రాహుల్ తెవాటియా రనౌట్ అయ్యాడు. అదే ఓవర్ రెండో బంతికి షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ కూడా క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లు దీపక్ చాహర్ ఓవర్‌లోనే వచ్చాయి. ఈ విధంగా, గుజరాత్ కేవలం 179 పరుగుల స్కోరు వద్ద వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయింది.
ఇవి కూడా చదవండి
గుజరాత్ బలమైన స్కోర్..
గుజరాత్ ఇన్నింగ్స్ విషయానికొస్తే, మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. వరుసగా రెండో మ్యాచ్‌లో, యువ ఓపెనర్ సాయి సుదర్శన్ ఈ జట్టు తరపున కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి మ్యాచ్‌లో 74 పరుగులు చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఈసారి 41 బంతుల్లో 63 పరుగులు చేశాడు. అదే సమయంలో, కెప్టెన్ గిల్ 27 బంతుల్లో 38 పరుగులు, జోస్ బట్లర్ 24 బంతుల్లో 39 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ముంబై తరపున కెప్టెన్ హార్దిక్ పాండ్యా అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. అతను 4 ఓవర్లలో కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..