గ్రూప్-3 పోస్టుల భర్తీకి కూడా టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్
1,365 పోస్టులకు జారీ.. జనవరి 24 నుంచి దరఖాస్తులు
అదేరోజు వెబ్‌లో పోస్టుల విద్యార్హత, రిజర్వేషన్ల సమాచారం
ఇంటర్వ్యూ ఉండదు.. ఆగస్టులో రాత పరీక్ష నిర్వహణ
ఇప్పటిదాకా టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్లు 22
వాటి ద్వారా మొత్తం 17,457 పోస్టుల భర్తీకి చర్యలు
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగుల (unemployed)కు శుభవార్త! రాష్ట్రం (Telangana)లో ఖాళీ పోస్టుల భర్తీ కోసం మరో నోటిఫికేషన్ జారీ అయింది. ఇప్పటికే గ్రూప్-1 (Group-1 posts), గ్రూప్-2 (Group-2 posts), గ్రూప్-4 (Group-4 posts) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ (TSPSC).. తాజాగా శుక్రవారం గ్రూప్-3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (22/2022) జారీ చేసింది. ఇందులో భాగంగా సుమారు 1,365 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో 80 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వివిధ విభాగాల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తోంది. ఒక్క టీఎస్‌పీఎస్సీయే ఇప్పటి వరకూ 17,457 పోస్టుల భర్తీకి 22 నోటిఫికేషన్లను జారీ చేసింది. ఇప్పటికే కొన్ని పోస్టుల భర్తీకి పరీక్షలను నిర్వహించారు. మరికొన్ని పోస్టులకు దరఖాస్తులను స్వీకరించారు. ఇంకొన్ని పోస్టులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది.
ఫిబ్రవరి 23 దాకా గడువు
గ్రూప్-3 పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తులను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23వ తేదీల మధ్య స్వీకరించనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను జనవరి 24వ తేదీన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు టీఎస్‌పీఎస్సీ అధికారులు ప్రకటించారు. జనవరి 24వ తేదీ నుంచి https://www.tspsc.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హత, రిజర్వేషన్లు, రోస్టర్ విధానం వంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చని సూచించారు. మిగిలిన గ్రూప్ పరీక్షల తరహాలోనే గ్రూప్-3 పోస్టులకు కూడా ఇంటర్వ్యూ ఉండదు. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ పరీక్షను ఆగస్టులో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.
మొదలైన గ్రూపు-4 దరఖాస్తుల స్వీకరణ
గ్రూపు-4 పోస్టుల భర్తీకి ఈనెల 30వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీటిని సమర్పించడానికి జనవరి 19వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. గ్రూప్-4 పరీక్షలను మే నెలలో నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో పేపర్‌ను 150 మార్కుల చొప్పున మొత్తం రెండు పేపర్లను 300 మార్కులకు నిర్వహించనున్నారు. పరీక్షలో ప్రతిభ చూపే అభ్యర్థులను పోస్టుల కోసం ఎంపిక చేయనున్నారు.