Group-1 ప్రాథమిక పరీక్షలో 5 ప్రశ్నలు తొలగింపు

Written by RAJU

Published on:

145 ప్రశ్నలే లెక్కలోకి ఒక్కో ప్రశ్నకు 1.034

మార్కులతో మెరిట్‌ లిస్ట్‌ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం

ఫైనల్‌ ‘కీ’ విడుదల గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షలో 5 ప్రశ్నలు తొలగింపు

మొత్తం 145 ప్రశ్నలే పరిగణనలోకి

టీఎస్‌పీఎస్సీ నిర్ణయం.. ఫైనల్‌ ‘కీ’ విడుదల

హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్ష(Group-1 Preliminary Exam)లో ఐదు ప్రశ్నలను పూర్తిగా తొలగించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (Telangana State Public Service Commission) (టీఎస్‌పీఎస్సీ) నిర్ణయించింది. మొత్తం 150 ప్రశ్నల్లో 145 ప్రశ్నలనే పరిగణనలోకి తీసుకోనుంది. ప్రాథమిక ‘కీ’పై వచ్చిన అభ్యంతరాలు, పరిశీలన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తుది ‘కీ’ని మంగళవారం రాత్రి విడుదల చేసింది. దీనికి సంబంధించిన లింక్‌ను కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.

అక్టోబరు 29న విడుదల చేసిన మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్‌ ప్రకారం.. 29, 48, 69, 82, 138వ ప్రశ్నలను తొలగించారు. దీంతో మిగిలిన 145 ప్రశ్నల మార్కులనే పరిగణనలోకి తీసుకోనున్నారు. అయితే 5 మార్కులు తొలగించినా మొత్తం మార్కులు 150గానే ఉంటాయి. దీనికోసం ఒక్కో ప్రశ్నకు మార్కును 1కంటే స్వల్పంగా పెంచి 1.034 మార్కులుగా నిర్ణయించారు. దీని ప్రకారమే మెరిట్‌ లిస్ట్‌ ఖరారు చేయనున్నారు. ఇక రెండు ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలను సరైనవిగా పేర్కొన్నారు. 133వ ప్రశ్నకు 1 లేదా 2 ఆప్షన్లు కూడా సరైనవేనని, వీటిలో దేనిని ఖరారు చేసినా మార్కు కేటాయిస్తామని తెలిపారు. కాగా, 107వ ప్రశ్నలో 1, 2, 3, 4 ఆప్షన్లు నాలుగూ సరైనవేనని ఖరారు చేశారు. అలాగే 57వ ప్రశ్నకు 1వ ఆప్షన్‌ సరైన సమాధానంగా ఖరారు చేశారు. ఓఎమ్‌ఆర్‌ పత్రాలను ఈనెల 29 వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని తెలిపారు. గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీని ఇటీవలే విడుదల చేసి అభ్యంతరాలను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొత్తం 150 ప్రశ్నల్లో 8 ప్రశ్నలపై ఎక్కువ అభ్యంతరాలు వచ్చాయి. ప్రత్యేక కమిటీ నిర్ణయం మేరకు ఫైనల్‌ కీ విడుదల చేశామని టీఎ్‌సపీఎస్సీ కార్యదర్శి తెలిపారు.

Updated Date – 2022-11-16T12:29:43+05:30 IST

Subscribe for notification
Verified by MonsterInsights