Golden Jubilee: శ్రీసరస్వతీ విద్యాపీఠం స్వర్ణజయంతి వేడుకలు

Written by RAJU

Published on:

హైదరాబాద్: శ్రీసరస్వతీ విద్యాపీఠం (Sri Saraswathi Vidyapitham) ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణజయంతి (Golden Jubilee Celebrations) వేడుకలు ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్న ప్రధాన అధ్యాపకులు, ఉప ప్రధాన అధ్యాపకులకు శిబిరం నిర్వహించారు. హైదరాబాద్ శారదాధామంలోని శిక్షణ కేంద్రం ఆవరణలో 3 రోజుల పాటు కార్యక్రమం నిర్వహించారు.

ప్రధాన అధ్యాపకుల శిబిరంలో శ్రీసరస్వతీ విద్యాపీఠం ప్రగతిని చర్చించారు. శిశుమందిర్ పాఠశాలల నిర్వహణలో కీలకపాత్ర వహిస్తున్న ఆచార్యులతో భవిష్యత్తు ప్రణాళిక మీద చర్చ జరిపారు. ఈ సందర్భంగా ఆటల పోటీలు (Sports Competitions), సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Events) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ తిరుపతిరావు, కార్యదర్శి ముక్కాల సీతారాములు, క్షేత్ర శైక్షణిక్ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ మార్గనిర్దేశం చేశారు.

Sri Saraswathi Vidyapitham Golden Jubilee Celebrations

శిబిరం సందర్భంగా శ్రీసరస్వతీ విద్యాపీఠం అభ్యున్నతికి కృషిచేసిన సంఘటన కార్యదర్శులను సన్మానించారు. జేఎమ్ కాశీపతి, లింగం సుధాకర్ రెడ్డి, వీఆర్ జగదీష్, పతకమూరి శ్రీనివాస్, కన్నా భాస్కర్, పసర్తి మల్లయ్య తదితరులను సత్కరించారు. ఈ నిరంతర కృషిలో జీవిత పర్యంతం సేవలు అందిస్తున్న ప్రచారక్‌లను సత్కరించారు. ఈ ప్రస్థానంలో ముఖ్యపాత్ర పోషించిన నాయకత్వ శ్రేణులు, బోధన – బోధనేతర సిబ్బందిని అభినందించారు. మూడు రోజుల శిబిరం నిర్వహణ ద్వారా సిబ్బందిలో మరింత ఉత్తేజం కల్పించారు.

స్వర్ణజయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా విద్యాభారతి అఖిల భారత అధ్యక్షులు దూసి రామకృష్ణారావు, సంఘటన కార్యదర్శి గోవింద్ మొహంతో, దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు, కార్యదర్శి అయాచితుల లక్ష్మణరావు, సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి విచ్చేసి మార్గదర్శనం చేశారు. తెలుగు రాష్ట్రాలో 400కు పైగా పాఠశాలలను శ్రీసరస్వతి విద్యాపీఠం నిర్వహిస్తున్నది. తెలుగు నాట అన్ని వర్గాల విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను, సామాజిక నైపుణ్యాలను అందించేందుకు 50 సంవత్సరాలుగా శ్రీసరస్వతీ విద్యాపీఠం సేవాభావంతో కృషి చేస్తున్నదని వక్తలు కొనియాడారు.

Updated Date – 2023-02-12T21:25:30+05:30 IST

Subscribe for notification