ఒక్క రోజే రూ.2,400 పతనం
రూ.94,000 వరకు తగ్గే అవకాశం
న్యూఢిల్లీ: పసిడి పరుగుకు బ్రేక్ పడింది. నిన్న మొన్నటి వరకు రేసు గుర్రంలా పరిగెత్తిన పుత్తడి ధర బుధవారం ఒక్కసారిగా బ్రేక్ తీసుకుంది. మంగళవారం ఢిల్లీ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో రూ.1,02,100 పలికిన 10 గ్రాముల మేలిమి బంగారం ధర బుధవారం రూ.2,400 పతనమై రూ.99,200కు చేరింది. ప్యూచర్స్ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి. జూన్‌లో డెలివరీ ఇచ్చే 10 గ్రాముల మేలిమి బంగా రం ధర బుధవారం మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజిలో (ఎంసీఎక్స్) రూ.1,435 తగ్గి రూ.95,905 వద్ద ట్రేడైంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పుత్తడి ధర దిగొస్తోంది. మంగళవారం రికార్డు స్థాయిలో 3,500.33 డాలర్లకు చేరిన ఔన్స్ (31.10 గ్రాములు) పసిడి ధర బుధవారం 3,300-3,318 డాలర్ల మధ్య ట్రేడైంది. ‘పసిడి ధర చాలా బలహీనంగా ఉంది. ఈ నెల 3 తర్వాత ధర ఇంత భారీగా తగ్గడం ఇదే మొదటిసారి. అయితే ఇది స్వల్ప కాలిక దిద్దుబాటు మాత్రమే’ అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ రీసెర్చి అనలిస్టు జతిన్ త్రివేది చెప్పారు. వచ్చే కొద్ది రోజుల్లో దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.94,000 నుంచి రూ.98,000 మధ్య ట్రేడయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.
అమ్మకాలు కష్టమే: బంగారం ధరలు లక్ష రూపాయలకు అటూఇటూగా కదలాడుతున్న నేపథ్యంలో అమ్మకాల పరిమాణం 9-11 శాతం పడిపోయే అవకాశం ఉందని రేటింగ్ కంపెనీ క్రిసిల్ అంచనా వేసింది. ఈ ప్రభావం ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్, ఈ నెల 30న వచ్చే అక్షయ తృతీయ అమ్మకాలపై కనిపిస్తోంది. ప్రధాన నగరాల్లో ఏ నగల షాపు చూసినా బోసిపోయి కనిపిస్తోంది. వచ్చే కొద్ది మంది కూడా కొద్దిపాటి కొనుగోళ్లతోనే సరిపెడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్ అమ్మకాలు 40 శాతం కూడా లేవని వ్యాపారులు చెబుతున్నారు.
విలువపరంగా ఓకే: గత ఆర్థిక సంవత్సరం దేశీయ మార్కెట్‌లో పసిడి ధర 25 శాతం పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు చూసినా 20 శాతం పెరిగింది. ఇవే ధరలు కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) అమ్మకాల పరిమాణం 9-11 శాతం తగ్గినా, అమ్మకాల విలువ మాత్రం గత ఏడాదితో పోలిస్తే 13 నుంచి 15 శాతం పెరిగి రూ.5 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని క్రిసిల్ చెబుతోంది.
తగ్గిన ట్రంప్ జోరే కారణం: తాజా పరిణామాల నేపథ్యంలో వాణిజ్య యుద్ధం విషయంలో ట్రంప్ తెగే వర కూ లాగకపోవచ్చనే అంచనాలు పసిడి ధరలపై ప్రభావం చూపాయి. పెట్టుబడుల రక్షణ కోసం నిన్న మొన్నటి వరకు పసిడిని కొనుగోలు చేసిన మదుపరులు బుధవారం ఒక్కసారిగా అమ్మకాలకు దిగారు. అలాగే వడ్డీరేట్లు తగ్గించక పోతే ఫెడ్ చైర్మన్ జెరోం పోవెల్‌ను ఆ పదవి నుంచి పీకి పారేస్తామని కొద్ది రోజుల క్రితం ప్రకటించిన ట్రంప్ మంగళవారం ఒక్కసారిగా దీనిపై వెనక్కి తగ్గి అలాంటి ఆలోచనే లేదనడం కూడా మార్కెట్‌కు ఊరట కలిగించింది.
Updated Date – Apr 24 , 2025 | 03:56 AM