పసిడి పరుగులకు కామాలే తప్ప ఫుల్స్టాప్ పడడం లేదు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అమెరికా మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 3,000 డాలర్లు పలుకుతోంది. మన దేశంలోనూ పసిడి జోరు అలాగే కనిపిస్తోంది. బంగారం రేట్లు ఇంతలా భగ్గుమనడానికి కారణం ఇద్దరే ఇద్దరూ. ఒకళ్లేమో తమ నిర్ణయాలతో బంగారం రేట్లు పెరగడానికి కారణమవుతున్నారు. మరొకరు ఇంటర్నేషనల్ మార్కెట్లో అడ్డగోలుగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
గత ఏడాదికాలంలో గోల్డ్ రేటు 38 శాతం పెరిగింది. అంటే ఏడాది కిందట బంగారం కొన్నవారికి ఇప్పుడు 38 శాతం లాభం వచ్చినట్లే లెక్క. ఎల్లో మెటల్ అడ్డూ అదుపు లేకుండా పరిగెత్తడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలతో బంగారం రేటు ఇంకా పెరుగుతుందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఇక ఈ వార్త రాసే సమయానికి బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.86,840
22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.79,550
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 1,12,000
ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితి, మొన్నటిదాకా మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ వాతావరణంతో ఉద్రిక్తతలు, రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగకపోవడం.. ఇలాంటివన్నీ అగ్నికి ఆజ్యం పోసినట్లు బంగారం ధరలు భగ్గుమనేలా చేస్తున్నాయంటున్నారు నిపుణులు. ఇక ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ధరలు, కరెన్సీ బలహీనత కూడా గోల్డ్ రేట్లు పెరగడానికి ఊతం ఇస్తున్నాయి. ఇండియా, చైనా సెంట్రల్ బ్యాంకులు పోటీ పడి మరీ ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం కొనడం కూడా దాని రేట్లకు రెక్కలు వచ్చేలా చేస్తోంది.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక, 2025లో గోల్డ్ రేట్లు పెరుగుతాయని, పది గ్రాముల బంగారం రేటు.. లక్ష మార్క్‌ని టచ్ చేస్తుందని నిపుణులు లెక్కలు కట్టారు. దానికి కొంత సమయం పడుతుందని భావించారు. అయితే అనుకున్న దానికంటే వేగంగా బంగారం రేట్లు పెరుగుతుండడం, అది కూడా స్వల్ప కాలంలోనే పెరుగుతుండడం, పరిశీలకులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. బంగారం రేటు ఇంత త్వరగా 89 వేల రూపాయలను టచ్ చేస్తుందని ఎవరూ అంచనా వేయలేకపోయారు. ఇక అది 90 వేలు, లక్ష మార్కును కూడా టచ్ చేసే అవకాశం లేకపోలేదంటున్నారు నిపుణులు.
అమెరికా దిగుమతులపై భారీగా పన్నులు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం… ప్రపంచ వాణిజ్యాన్ని అనిశ్చితిలోకి నెట్టింది. ఇప్పటికే చైనా దిగుమతులపై సుంకాలు విధించారు. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడి నుంచి వస్తున్న ఈ వరుస వార్నింగుల నేపథ్యంలో, సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి బంగారం కొనుగోళ్లకు మదుపర్లు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే బంగారం ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
నిరంతర ఆర్థిక అనిశ్చితులు, అధిక ద్రవ్యోల్బణ రేట్లు బంగారం ఆకర్షణను మరింత పెంచాయి. చారిత్రాత్మకంగా ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యాలకు వ్యతిరేకంగా బంగారం ఒక రక్షణగా నిలిచింది. ప్రపంచ మార్కెట్లు బలహీనమైన ఆర్థిక పరిస్థితులు, సంభావ్య మాంద్యం భయాలతో పోరాడుతున్నందున, పెట్టుబడిదారులు భద్రతా బంగారం ఆఫర్లను కోరుకుంటున్నారు. బలహీనమైన ఆర్థిక వృద్ధి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ఖర్చుల కలయిక బంగారం సురక్షితమైన స్వర్గధామంగా దాని స్థానాన్ని బలోపేతం చేసింది.
అధిక వడ్డీ రేట్లు, బలమైన US డాలర్ వంటి సాంప్రదాయకంగా ప్రతికూల కారకాలు ఉన్నప్పటికీ బంగారం ర్యాలీ కొనసాగుతోంది. అయినప్పటికీ, ప్రపంచ డిమాండ్, ముఖ్యంగా చైనా నుండి ఒత్తిళ్లను అధిగమించింది. పెట్టుబడి డిమాండ్ పెరుగుతూనే ఉంటే ఔన్సుకు 3,500 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. విశ్లేషకులు ఇప్పుడు బంగారం కొత్త ఎత్తులకు చేరుకుంటుందని ఊహిస్తున్నారు. 1980 నుండి ద్రవ్యోల్బణం-సర్దుబాటు చేసిన గరిష్ట స్థాయి 3,800 డాలర్ల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ప్రస్తుత పథం బంగారం కొనసాగుతున్న ఆర్థిక, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య దాని చారిత్రాత్మక పెరుగుదలను కొనసాగించవచ్చని సూచిస్తుంది. ప్రతీకార సుంకాల పేరుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంకెలు వేసినంత కాలం…గోల్డ్ రేటుకు సంబంధించిన అంకెలు పైపైకే వెళతాయంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బంగారం రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..