బంగారం కొనడం అనేది భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. డబ్బును దాచాలన్నా, పొదుపు చేయాలన్నా, శుభకార్యాలు జరపాలన్నా అన్నింటికీ బంగారంతోనే ముడి పడి ఉంటుంది. అయితే, బంగారం కొనేటప్పుడు బంగారం షాపు వారు చెప్పే లెక్కలను కొంచెం శ్రద్ధగా పరీక్షించుకోవాలి. వారు చెప్తున్న విషయాలను సరిచూసుకోవాలి. లేదంటే బంగారం ధరలు కొండెక్కిన వేళ మోసపోయే ప్రమాదం ఉంది. బంగారం విక్రయదారులు మీ నుంచి దాచే ఈ 5 రహస్యాల గురించి తెలుసుకోండి.
1. సీక్రెట్ చార్జీలు..
బంగారం కొనేటప్పుడు, షాపు వారు అదనపు ఖర్చుల గురించి కొన్నిసార్లు ముందే స్పష్టంగా చెప్పరు. ఇందులో తయారీ ఖర్చులు, వృథా ఖర్చులు, పన్నులు ఉంటాయి. ఈ ఖర్చులు బంగారం ఫైనల్ ధరను గణనీయంగా పెంచుతాయి. కొనుగోలుదారులు ఈ ఖర్చుల గురించి తెలుసుకోకపోతే, వారు ఊహించని ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తుంది.
2. స్వచ్ఛత గురించి తప్పుడు సమాచారం
కొందరు బంగారం షాపువారు, నగలు తయారు చేసేవారు బంగారం స్వచ్ఛత గురించి తప్పుడు సమాచారం ఇస్తారు. ఉదాహరణకు, 22 క్యారెట్ల బంగారం అని చెప్పి, 18 క్యారెట్ల బంగారాన్ని విక్రయించవచ్చు. ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించకపోవడం వల్ల కొనుగోలుదారులు మోసపోయే అవకాశం ఉంది.
కాబట్టి దీని గురించిన సమాచారాన్ని ముందే తెలుసుకుని ఉండాలి.
3. తూకంలో తికమకలు..
బంగారం బరువును కొలిచే సమయంలో, కొందరు తప్పుడు త్రాసులను ఉపయోగించవచ్చు లేదా ఆభరణాల్లో ఉన్న రాళ్లు లేదా ఇతర అలంకరణల బరువును బంగారం బరువుతో కలిపి చూపించవచ్చు. ఇది బంగారం బరువును ఎక్కువగా చూపించి, ధరను పెంచేందుకు దారితీస్తుంది.
4. పాత లేదా రీసైకిల్ చేసిన బంగారం
కొన్ని సందర్భాల్లో పాత లేదా రీసైకిల్ చేసిన బంగారు ఆభరణాలను కొత్తవిగా చూపించి విక్రయిస్తారు. ఇటువంటి బంగారం తరచూ నాణ్యతలో తక్కువగా ఉంటుంది, కానీ కొనుగోలుదారులకు ఈ విషయం తెలియకపోవచ్చు.
5. బైబ్యాక్ నిబంధనలు
బంగారం తిరిగి విక్రయించే సమయంలో తమ బైబ్యాక్ విధానాల గురించి స్పష్టంగా వెల్లడించరు. తిరిగి కొనేటప్పుడు వారు గణనీయమైన మొత్తాన్ని తగ్గించవచ్చు లేదా తక్కువ రేటును అందించవచ్చు. ఈ విషయం కొనుగోలు సమయంలో చెప్పకపోవడం వల్ల కొనుగోలుదారులు నష్టపోవచ్చు.
ఈ జాగ్రత్తలు తీసుకోండి..
బంగారం కొనేటప్పుడు, స్వచ్ఛత ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలి, వివరణాత్మక బిల్లింగ్‌ను అడగాలి, మార్కెట్ రేట్లను సరిపోల్చాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు మోసపోకుండా సురక్షితంగా బంగారం కొనుగోలు చేయవచ్చు.